Leading News Portal in Telugu

Kashmiri Students Fight: చంద్రయాన్-3 విజయంతో ఇతర స్టూడెంట్స్ సంబరాలు.. కాశ్మీరీ విద్యార్థుల దాడి


రాజస్థాన్ లోని మేవార్ విశ్వవిద్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే, చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకల్లో కాశ్మీరీ విద్యార్థులు, ఇతర విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. మేవార్ యూనివర్శిటీలో రెండు విద్యార్థి వర్గాల మధ్య జరిగిన ఈ వివాదం తీవ్రరూపం దాల్చి రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేసుకునే వారికి చేరుకుంది.

అయితే, యూనివర్శిటీ మెస్ లో ఈ గొడవ స్టార్ట్ అయినట్లు తెలిపారు. భోజనం చేస్తూ కూర్చున్న రాహుల్ అనే విద్యార్థిని కొందరు కశ్మీరీ విద్యార్థులు కొట్టారు. అయితే అసలు కారణం చంద్రయాన్-3 విజయానికి సంబరాలు అని సదరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు ఆయుష్, కృష్ణపాల్ శర్మ తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఇతర విద్యార్థులు వెల్లడించారు.

గులాబ్పురాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆయుష్ శర్మ ఆగస్టు 23న చంద్రయాన్-3 విజయవంతమైనందుకు యూనివర్సిటీలో సంబరాలు చేసుకున్నాడు. ఇది కొందరు కాశ్మీరీ స్టూడెంట్స్ కు నచ్చలేదు. విక్రమ్ సాఫ్ట్ గా ల్యాండ్ కావడంతో ఆయుష్ ఆనందం వ్యక్తం చేస్తూ.. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు చేశాడు. దీంతో అక్కడే ఉన్న కాశ్మీరీ స్టూడెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కృష్ణపాల్ శర్మతో పాటు మరి కొందరు ఆయుష్ శర్మకు సపోర్ట్ గా నిలిచారు. దీంతో మరో వర్గం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పదునైన ఆయుధాలతో గొడవకు దిగారు.

హిందూ విద్యార్థులతో గొడవపడిన తర్వాత కాశ్మీరీ విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్ లో పదునైన ఆయుధాలు, కర్రలతో దాడులకు దిగేందుకు ప్రయత్నించారని స్థానిక విద్యార్థులు ఆరోపించారు. అయితే దీనిపై మేవార్ యూనివర్సిటీ యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనిపై వర్సిటీ యాజమాన్యం విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, దీనిపై నివేదిక రావాల్సి ఉంది. కాగా.. కాశ్మీరీ విద్యార్థులు అల్లాహు అక్బర్ నినాదాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్న కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.