Leading News Portal in Telugu

Increase Retirement Age:గుడ్ న్యూస్.. వారి రిటైర్‌మెంట్‌ వయస్సు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం


Increase Retirement Age: ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పదవీకాలన్నీ మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పీఎస్‌బీల మేనేజింగ్‌ డైరెక్టర్ల పదవీ కాలం 60 సంవత్సరాలుగా ఉంది. అయితే వీరి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందట. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి గురించి, అభివృద్ధి గురించి తెలిసిన వీరి సేవలను మరికొంత కాలం వినియోగించుకుంటే బాగుంటుందని ప్రభుత్వం అనుకుంటుందట. దీంతోనే వారి పదవీవిరమణ వయసును పెంచాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం.

ఈ నిర్ణయంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ ఖారా పదవీకాలం కూడా మరో రెండేళ్లు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 2020 నుంచి ఎస్బీఐ చైర్మన్‌గా ఖారా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అక్టోబర్ తో ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ అక్టోబర్ తో ఆయనకు 63 ఏళ్లు వస్తాయి. అయితే ఆయన పదవీవిరమణ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆయన మరో రెండేళ్లు సేవలను అందిస్తారు. ప్రభుత్వ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ వయసును కూడా 65 ఏళ్లకు పెంచే అవకాశాలు ఉన్నాయి. అయితే దేశంలో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులలో మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పదవీకాలం ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉంది. ప్రభుత్వం కనుక రిటైర్మెంట్ విషయంలో నిర్ణయం తీసుకుంటే అది 62 సంవత్సరాలు కానుంది. ఇక గతేడాదే డైరెక్టర్ల గరిష్ట కాల పరిమితిని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికైతే రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచే నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదని, భవిష్యత్తులో తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. చూడాలి మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో. ఇక వచ్చే రెండు నెలల్లో అంటే అక్టోబర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ ఖారా పదవీకాలం ముగుస్తుంది. కాబట్టి ఈ రెండు నెలల లోపే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆయన రిటైర్మెంట్ వయసు పెరిగే అవకాశం ఉంది.