Leading News Portal in Telugu

Tomato Price : లబోదిబోమంటున్న టమాటా రైతులు


మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. అయితే.. తాజాగా టమాటా ధరలు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కిలో రూ.200 నుంచి రూ.250కి చేరిన టమాటా ధరలు ఇప్పుడు రూ.10కి దిగువకు చేరాయి. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో టమోటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తికొండ నియోజకవర్గానికి చెందిన టమోటా రైతులు తాము పండించిన పంటకు మంచి ధర వస్తుందనే ఆశతో వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు భారీగా టమాటను తీసుకువచ్చారు రైతులు. అయితే… మార్కెట్‌ యార్డులో అధికారులు టమాటను వేలం వేయగా క్వింటాల్‌ రూ.1000 పలికింది. అంటే కేజీ టమాట రూ.10కి అమ్ముడుపోయింది. దీంతో అత్యుత్సాహంతో వచ్చిన రైతులు అవాక్కయ్యారు.

టమోటాలను రోడ్డుపై పడేయలేక రైతులు మార్కెట్‌లో నిర్ణయించిన ధరకు విక్రయించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రైతుల నుంచి కిలో రూ.10కి కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.50కి విక్రయిస్తుండడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. క్వింటాల్ టమాటాకు రూ.వెయ్యిలోపే ధర పలికింది. అంటే.. కిలో టమాటా రూ.10 మాత్రమే. ఈ ధరకు అమ్ముకుంటే కనీసం ట్రాన్స్ పోర్ట్ ఖర్చులకు కూడా గిట్టుబాటు కాదని చెప్పారు. కాగా, బహిరంగ మార్కెట్లో వినియోగదారులు మాత్రం టమాటాలకు కిలో రూ.30 నుంచి రూ.40 మధ్యలో చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది.