Leading News Portal in Telugu

IND vs IRE: ఐర్లాండ్‌ కెప్టెన్‌ చెత్త రికార్డు.. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా!


Most Ducks in T20 Cricket: అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్‌ కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ అత్యంత చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అ‍త్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు స్టిర్లింగ్‌ 13 సార్లు డకౌట్‌ అయ్యాడు. ఆదివారం డబ్లిన్‌ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20 ద్వారా స్టిర్లింగ్‌ ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు. పేసర్ ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో స్టిర్లింగ్‌ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఆడిన అతడు ఒక్క పరుగులు కూడా చేయడకుండా పెవిలియన్ చేరాడు.

రెండో టీ20 ముందువరకు ఈ రికార్డు ఐర్లాండ్‌ మాజీ ప్లేయర్ కెవిన్‌ ఓబ్రియన్‌ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయిన పాల్‌ స్టిర్లింగ్‌.. ఓబ్రియన్‌ (12) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో జింబాబ్వే క్రికెటర్‌ చకాబ్వా (11) మూడో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ ప్లేయర్ సౌమ్య సర్కార్‌ (11) నాలుగో స్థానంలో ఉన్నాడు. హషన్ తిలకరత్న, ఉమర్ అక్మల్, దశున్ శనక, రోహిత్ శర్మలు పదేసి డకౌట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

రెండో టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 33 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్‌ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఐర్లాండ్‌ విఫలమయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఓపెనర్‌ అండీ బల్బిర్నీ (72; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (58; 43 బంతుల్లో 6×4, 1×6), సంజు శాంసన్‌ (40; 26 బంతుల్లో 5×4, 1×6) రాణించారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆగస్టు 23న జరగనుంది.