Karumuri Nageshwara Rao: రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు – నేడు ఏం జరిగిందో అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పచ్చగడ్డిలా మేసేసిందని.. గత ప్రభుత్వం కేవలం రెండు కోట్ల మెట్రిక్ టన్నుల వరకే ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రభుత్వం 32 లక్షల మంది రైతుల నుంచి 3 కోట్ల 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 58 వేల కోట్లు చెల్లించామన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. లోకేష్ అసలు మనిషేనా అంటూ మండిపడ్డ మంత్రి.. కేసులు పెట్టించుకోమని చెప్పే హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. కొడాలి నాని చిటికెన వేలు మీద ఈక కూడా పీకలేవు లోకేష్ అంటూ మంత్రి మండిపడ్డారు. ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.