Leading News Portal in Telugu

Mulugu Brs: ములుగు జిల్లా బీఆర్ఎస్లో నిరసన సెగలు


ములుగు జిల్లా బీఆర్ఎస్లో నిరసన సెగలు రగులుతున్నాయి. మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ పార్టీ కార్యకర్తలతో సారంగపల్లిలో భేటీ అయ్యారు. ములుగు నుంచి బరిలో దిగనున్నట్లు ప్రహ్లాద్ తెలుపుతున్నారు. ఇంచార్జ్ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతికి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంపై ప్రహ్లాద్ అసంతృప్తి సెగలో ఉన్నారు. ఈ నెల 21న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ములుగు నియోజకవర్గానికి నాగజ్యోతి పేరును ప్రకటించడంతో చాపకిందినీరులా అసంతృప్తి సెగలు మొదలయ్యాయి.

మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ తన అనుచరులతో ములుగు మండలం సారంగపల్లిలో భేటీ అయ్యారు. ములుగు జెడ్పీ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ మరణాంతరం ములుగు బీఆర్ఎస్ రాజకీయాల్లో కొంత స్థబ్దత నెలకొంది. ఆయన స్థానంలో జెడ్పీ వైస్ చైర్మన్ గా ఉన్న బడే నాగజ్యోతి ఇంచార్జ్ జెడ్పీ చైర్మన్ గా నియమితులయ్యారు. చందూలాల్ మరణాంతరం యాక్టివ్ గా పనిచేసిన ప్రహ్లాద్.. ములుగు టికెట్ ఆశించారు. అయితే ఇప్పుడు ములుగు అసెంబ్లీ అభ్యర్థిగా నాగజ్యోతిని ప్రకటించడంపై.. తీవ్ర అసంతృప్తికి గురైన ప్రహ్లాద్ తన మద్దతుదార్లతో సారంగయ్యపల్లిలో సమావేశం నిర్వహించారు.

కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకోగా.. ప్రహ్లాద్ కు అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ కోసం ప్రయత్నాలు చేసినా సీఎం కేసీఆర్ నిరాకరించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మాజీ మంత్రి చందూలాల్ ఓటు బ్యాంకు తన వెంట ఉందని ప్రహ్లాద్ అంటున్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు కార్యచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే.. తమకు మద్దతు 100 శాతం ఉందన్నారు. దీంతో ములుగు బీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.