ఆసుపత్రికి వైసీపీ రంగులు.. వైసీపీ పిచ్చికి పరాకాష్ట! | ycp colours to hospital| mania| peaks| courts| objection| directions
posted on Aug 28, 2023 6:16AM
అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. గుడి.. బడి, చెట్టు.. పుట్ట, ప్రాణం పొసే ఆసుపత్రి.. చివరి మజిలీ స్మశానం, కుప్ప తొట్టె.. సెప్టిక్ ట్యాంక్, కరెంట్ స్థంభం.. బోరింగ్ పంపు సెట్టు కాదేదీ వైసీపీ రంగులకనర్హం అన్నట్లుగా చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే దేవాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రులకు, విద్యుత్ స్తంభాలకు, కరెంట్ వైర్లకు, స్మశానంలో సమాధులకు, పశువుల ఆసుపత్రిలో బోనులకు, పబ్లిక్ టాయిలెట్స్ ను సైతం వదలకుండా అన్నిటికీ వైసీపీ రంగులేశారు. గతంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి పార్టీ జెండా రంగులు వేసి చివాట్లు తిన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే చిక్కీల ప్యాకెట్ కవర్ ను పార్టీ జెండా రంగుతో పులిమేసి తమ పైత్యాన్ని చాటుకున్నారు.
గడచిన నాలుగేళ్ళలో వైసీపీ పాలన అంతా విగ్రహాలు, రంగుల చుట్టూనే తిరుగుతుంది. ప్రభుత్వ కార్యాయాలయాల దగ్గర్నుంచి, యూనివర్సిటీల పేరు మార్పు వరకూ.. విగ్రహాల దగ్గర్నుంచి, నిగ్రహం కోల్పోయి బూతులు మాట్లాడడం వరకూ వైసీపీ నేతలు పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. ఈ రంగుల పిచ్చి ఏంటని ఇప్పటికే పదులసార్లు కోర్టు చేత మొట్టికాయలు వేయించుకుని తల బొప్పి కడుతున్నా.. వైసీపీ నేతల తీరుమాత్రం మారడం లేదు. ఇంకా చెప్పాలంటే మీకు పిచ్చి పట్టిందిరా నాయనా ఎక్కడికైనా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని.. ప్రతిపక్షాలు, సామాన్యులు గగ్గోలు పెడుతున్నా.. నవ్వి పోదురు నాకేంటి అనేలా ఉంది వైసీపీ నేతల వ్యవహారం. చేసింది.. చేసేది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువ.. పావలా కోడికి ముప్పావల మసాలా నూరినట్లుంది వైసీపీ నేతల ప్రచార పిచ్చి.
గతంలో ఇలాంటి రంగుల పిచ్చి ఘటనలను చాలానే చూడగా ఇప్పుడు మరోసారి తమ పిచ్చి పరాకాష్టకు చేరిందని నిరూపించుకున్నారు వైసీపీ నేతలు. సీఎం సొంత జిల్లా కడప జిల్లా పోరుమామిళ్లలో ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో ఇక్కడ 30 పడకల ఆసుపత్రిగా ఉండగా.. తాజాగా దానిని 50 పడకలుగా అప్ గ్రేడ్ చేశారు. దీని అభివృద్ధికి పెట్టిందేమో కొంచమే కానీ.. ఆసుపత్రికి వైసీపీ రంగులేసేందుకు మాత్రం భారీగా ఖర్చు పెట్టేశారు. కేవలం 20 పడకలు పెంచేసి ఆసుపత్రిని వైసీపీ కార్యాలయం మాదిరిగా రంగులేసుకున్నారు. దీనిపై ఇప్పుడు తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఇలాగే పంచాయతీ కార్యాలయాలకు, పాఠశాలలకు, ప్రభుత్వ వాహనాలకు, చివరకు చెత్తను తరలించే వాహనాలకు కూడా వైసీపీ రంగులను వేయడం తీవ్ర వివాదాస్పదమయ్యింది.
వైసీపీ రంగుల పిచ్చితో అప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మేధావులు కోర్టులను ఆశ్రయించగా ప్రభుత్వానికి చీవాట్లు పెట్టారు. చివరికి కోర్టు ఆదేశాలతో ఆ రంగులను తొలగించాల్సి వచ్చింది. జగన్ సర్కార్ తీరుతో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అదంతా ప్రజల సొమ్మే. ఇప్పుడు కూడా ఆసుపత్రికి వైసీపీ రంగులేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలే వైరల్ అవుతున్నాయి. అయినా సరే అధికారుల్లో ఎటువంటి చలనం లేకుండా పోయింది. మళ్ళీ దీనికి కూడా ఆ కోర్టులే కల్పించుకొని ఆదేశాలిస్తే తప్ప ఈ ప్రభుత్వంలో చలనం ఉండదేమో. ప్రజల సొమ్ముతో పార్టీ రంగులు వేసుకోవడం.. కోర్టుతో చీవాట్లు తిని మళ్ళీ ఆ ప్రజల సొమ్ముతోనే వాటిని తొలగించడం.. బహుశా ఇలాంటి ముఖ్యమంత్రిని తెలుగు రాష్ట్రాల ప్రజలు గతంలో ఎన్నడూ చూసి ఉండరేమో!