హైదరాబాద్ లో సీపీఎం తెలంగాణ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంఠి రంగారెడ్డి, సీతారాములు సహా ఇతర సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగుతుంది. అందులో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీకి దగ్గరవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించ లేదని పేర్కొన్నారు. కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
తొందర పడాల్సిన అవసరం లేదని పార్టీ నిర్ణయించిందని తమ్మినేని పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై సెప్టెంబర్ 1 నుండి 7 వరకు ప్రదర్శనలు, నిరసనలు చేపడతామన్నారు. సాయుధ పోరాటం స్ఫూర్తితో సెప్టెంబర్ 10 నుండి 17 వరకు విప్లవ వార్షికోత్సవాలు జరుపనున్నట్లు ఆయన తెలిపారు. సాయుధ పోరాట వారసత్వం తమదేనని.. కొనసాగిస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు. అమిత్ షా, మోడీ తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆశలు ఆడియశాలు అయ్యాయని ఆరోపించారు. బీజేపీ మరింత పడిపోతుందని తమ్మినేని విమర్శించారు. బీజేపీ ఓ విష కూటమి అని దుయ్యబట్టారు. నిర్దిష్ట ప్రతిపాదన వచ్చినప్పుడు అన్ని రకాల చర్చలు చేస్తామని తెలియజేశారు. ఉమ్మడిగా ఏం చేయాలి అనేది ఆలోచన చేస్తామని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
పొత్తులపై కాంగ్రెస్ తో చర్చలు జరిపామని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవి కేవలం ప్రాథమిక చర్చలేనని పేర్కొన్నారు. తాము కొన్ని ప్రతిపాదనలు పెట్టామని.. తమను తాము త్యాగం చేసుకోలేమని కూనంనేని తెలిపారు. తమకు బలం ఉన్న సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. తమ ప్రతిపాదనలు కాంగ్రెస్ అడిగారని.. వాళ్లు ఆమోదం చెప్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరోసారి సిపిఐ, సిపిఎం నాయకత్వం కూడా భేటీ కాబోతుందని తెలియజేశారు.