Leading News Portal in Telugu

నాస్తికుడిని కాదు.. పరమభక్తుడిని: భూమన | bhumana says he is not an atheist| ttd| chairman| srivari


posted on Aug 28, 2023 10:55AM

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి  చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌ పదవిలో కొనసాగిన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఆలా ముగియగానే అలా  అయన స్థానంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేరును ఖరారు చేసేసి నియమించేశారు.

వాస్తవానికి గతంలో వైవీ నియామకం విషయంలో చెలరేగిన దుమారం, నేపధ్యంలో ఈసారి అయినా, హిందూ ధర్మం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉన్న వారికి, టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.  భూమన గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు. ఇప్పుడు   జగన్ రెడ్డి మరో మారు ఆయనకు ఆవకాశం కల్పించారు.   టీటీడీ చైర్మన్ రేసులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సిద్ధ రాఘవరావు పేర్లు కూడా వినిపించాయి. చివరకు  భూమనను ఆ పదవి వరించింది.

అయితే అదేమీ పాపమో, అదెక్కడి శాపమో కానీ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (2006 నుంచి 2008 వరకు) టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్నప్పుడే భూమనపై అనేక ఆరోపణలొచ్చాయి… నిజ నిజాలు ఏమో కానీ, ఏడుకొండల పవిత్రతను రెండు కొండలకు కుదించాలనే  దివ్యమైన  సంకల్పం భూమన కరుణాకర రెడ్డిదే అంటారు. అలాగే, మిగిలిన్ ఐదు కొండలపై చర్చిలు నిర్మించాలనే  సంకల్పం విషయంలోనూ భూమన భూమిక ఉందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే భూమన పై టీటీడీ నిధుల దుర్వినియోగం, వంటి  ఆరోపణలు అనేకం ఉన్నాయి. అన్నిటినీ మించి ఈరోజు… జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, బాబాయ్ టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి కొండపై యధేచ్చగా సాగుతున్న అన్యమత ప్రచారం, ఆస్తులు విక్రయం, నిధుల కైంకర్యం, తిరుమల  ఆధ్యాత్మిక స్థాయిని దిగజార్చి, వ్యాపార కేంద్రంగా మార్చేందుకు సాగుతున్న ప్రయత్నాల వంటి అనేక ఆకృత్యాలకు  భూమన కరుణాకర రెడ్డి ఆద్యుడనే అరోపణలున్నాయి. అందుకే ఇప్పడు కూడా ప్రతిపక్షాలతో పాటు   హిందూ ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు కరుణాకర రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

ఈ అన్నిటినీ మించి, ఆయనపై అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ వినిపించే ప్రధాన ఆరోపణ, ఆయన నాస్తికుడు.    వెంకన్న స్వామినే కాదు, అసలు దేవుడినే నమ్మని వ్యక్తి గా  భూమన చెప్పుకుంటారు. కోట్లాది మంది భక్తులు కొలిచే వెంకన్న దేవుడు, భూమన వారి దృష్టిలో కేవలం ఓ  నల్ల రాయి . అవును ఆయనే స్వయంగా ఈ మాట అన్నారు. అంతే కాదు,  మండే ఎండలో అయినా చెప్పులు లేకుండా కాలినడకన కొండనెక్కే భక్తులనూ  అవహేళన చేసిన చరిత్ర భూమనకుందని ఆయన ఒకప్పటి మిత్రులు ఇప్పుడు సోషల్ మీడియాలో  పాత  సంగతులను   గుర్తు చేస్తున్నారు. 

అలాగే, సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ  మాజీ ప్రధాన కార్యదర్శి, ఐవైఆర్ కృష్ణా రావు మొదలు అనేక మంది భూమన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.  భూమన నియామకం వెనక  రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సేవా కార్యక్రమల పేరిట టీటీడీ నిధులను దారి మళ్ళించి పందారం చేసిన విధంగా, రేపటి ఎన్నికలలో గెలిచేందుకు టీటీడీ నిధులను  సేవ  పేరున పందారం చేసే కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

మరో వంక   స్వామీ నీ కొద్దీ అన్యమత నాస్తిక చైర్మన్  యాష్ ట్యాగ్ తో భూమన నియామకానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భక్తులు తమ మొర నేరుగా స్వామి వారికే వినిపించుకుంటున్నారు. అలాగే శాపనార్ధాలు పెడుతున్నారు.  కాగా ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనదైన స్టైల్ లో స్పందించి సమాధానమిచ్చారు.  తిరుపతిలో రచయిత భుమాన్ రాసిన ‘మూడు తరాల మనిషి భూమన్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.    తాను నాస్తికుడిని కానని చెప్పుకున్నారు.  17 ఏళ్ల క్రితమే  భక్తి శ్రద్ధతతో టీటీడీ చైర్మన్ బాధ్యతలను నిర్వర్తించి స్వామి వారి దయకు పాత్రుడనయ్యానని చెప్పారు.