Leading News Portal in Telugu

ఎన్టీఆర్ వందరూపాయల వెండి నాణెం విడుదల | ntr 100 rupee coin released| draupadimurmu| rajbhawan| delhi| chandrababu


posted on Aug 28, 2023 11:18AM

శక పురుషుడు ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల వెండి నాణెం విడుదల  అయ్యింది. సోమవారం (ఆగస్టు 28) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. విశ్వ విఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వంద రూపాయల వెండి నాణెం ఆవిష్కరణ  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ గర్వకారణం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ పెదవాడి అన్నంగిన్నెగా మారిన ఎన్టీఆర్ తెలుగు ప్రజలకే కాదు.. రాజకీయాలతో కొద్ద పాటి పరిచయం ఉన్న ప్రతి వారికీ చిరపరిచితమైన పేరు.  సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు ఎన్టీఆర్.   ఒక సినిమా హీరోగా ఆయన తాను  జీవించిన  పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన  మహా నటుడు ఎన్టీఆర్.  

రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా  ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.  రాముడు ఎలా ఉంటాడాంటే,  ఆ నాటి  నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్  లాగానే ఉంటారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా …  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో   సజీవంగా ఉన్నారు. లక్షలాది మందికి చిరస్మరణీయుడు.

అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు.

సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఓ తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  ఆ నాణేన్ని ఈ రోజు విడుదల చేసింది. ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదలకు  ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గత ఏడాది  జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపిన సంగతి విదితమే.

ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ ను విడుదల అయ్యింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో  ఎన్టీర్ బోమ్మతో ఉన్న వందరూపాయల నాణెం విడుదల రాష్ట్రపతి ముర్ము విడుదల చేశారు.   ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయనతో పరిచయం ఉన్న వారు, సన్నిహితులు, రాజకీయ వేత్తలు ఇలా దాదాపు 300 మందికి పైగా ఆహ్వానితులు హాజరు అయ్యారు.

 https://www.youtube.com/watch?v=vld5EfjuKUk