Neeraj Chopra Interview after Wins Gold Medal in World Athletics Championships 2023: గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఈసారి స్వర్ణ పతకం సాధించాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈటెను 88.17 మీటర్లు విసిరిన నీరజ్.. పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటెను 88.17 మీటర్లు విసిరగా.. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఈ దూరాన్ని మరో అథ్లెట్ అధిగమించలేకపోయాడు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజత పతకం దక్కించుకోగా.. చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకుబ్ వాద్లెచ్ 86.67 మీటర్లతో కాంస్య పతకం సాధించాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2023లో పాకిస్థాన్ అథ్లెట్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో.. భారత దేశంలో ఈ పోరును ఇండో-పాక్ మధ్య యుద్ధంగా భావిస్తారని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం నీరజ్ మాట్లాడుతూ… ‘నేను ఏ పోటీకి ముందు అయినా ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడను. కానీ ఈ రోజు ఫోన్ చూడగా.. అందులో మొదటగా భారత్ vs పాకిస్థాన్ అని కనబడింది. అయితే యూరోపియన్ అథ్లెట్లు చాలా ప్రమాదకరం. వారు పెద్ద త్రోను చేయగలరు. అర్షద్ నదీమ్ మాత్రమే కాదు.. జాకుబ్ వాద్లెచ్, జూలియన్ వెబర్ కూడా ఉన్నారు. చివరి త్రో వరకూ ఇతర త్రోయర్ల గురించి ఆలోచిస్తూ ఉండాలి. అయితే స్వదేశంలో మాత్రం ఈ పోరును భారత్-పాక్ మ్యాచ్‌గా చూశారు’ అని తెలిపాడు.
త్వరలో ఆరంభం కానున్న ఆసియా క్రీడలు 2023లో నీరజ్, అర్షద్ పోటీ పడనున్నారు. దీనిపై నీరజ్ మాట్లాడుతూ… ‘ఆసియా గేమ్స్ 2023లో కూడా భారత్-పాకిస్థాన్ పోరుపై మరింత చర్చ జరుగుతుందని అనుకుంటున్నా. నేను మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటా. అథ్లెటిక్స్‌లో భారత్, పాకిస్థాన్ తమ స్థానాలను ఎలా మెరుగుపర్చుకుంటున్నాయో మేం చర్చించాం. ఇక్కడ యూరోపియన్ అథ్లెట్ల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు మేం వారి స్థాయికి చేరుకున్నాం’ అని నీరజ్ చెప్పుకొచ్చాడు.