పైన పటారం లోన లొటారం! | ycp vizag works inferior| mvisakhapatnam| bus| bay| collapse| mayor| inagurate
posted on Aug 28, 2023 2:38PM
ఏపీలో ఎన్నికలకు ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోగా ఎలాగైనా విశాఖను రాజధానిగా చేయాలన్నది వైసీపీ ప్రభుత్వం ఆలోచన. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉండడంతో ప్రభుత్వం చేసేందుకు ఏమీ లేదు. చేయగలిగిందీ ఏమీ లేదు. దీంతో అనధికారికంగానైనా విశాఖను పరిపాలన రాజధాని చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశపడుతున్నారు. కనీసం సీఎంఓను విశాఖలో ఏర్పాటు చేసి చూడండి నేను విశాఖ నుండే పరిపాలన చేస్తున్నానని చూపించాలని, చెప్పుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం రుషికొండపై భవంతులు కడుతున్నారు. ఇక్కడ కట్టేది సచివాలయం కోసమేనని ముందు వైసీపీ అధికారిక ట్విట్టర్ లో ప్రకటించి మళ్ళీ కాదని ఆ ట్వీట్ ను ఉపసంహరించుకుని నాలిక్కొరుక్కుంది. రుషికొండపై నిర్మాణంలో ఉన్న భవనాలు రాజధాని కోసం కాదని ప్రభుత్వం చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. కనీసం దసరాకైనా విశాఖ నుండి పరిపాలన చేయాలని ఆశపడుతున్న జగన్.. ఇప్పటికే విశాఖ నగరంలో కొన్ని మార్పులు, చేర్పులకు ఆదేశాలిచ్చారు.
ఇందులో భాగంగానే విశాఖ నగరంలో కొన్ని బ్యూటిఫికేషన్ పనులు కూడా చేస్తున్నారు. కొన్ని కొన్ని పార్కులు, రోడ్లు, రహదారులు, బస్టాండ్లు, మెయిన్ సెంటర్లు ఇలా పలుచోట్ల పలు రకాల సుందరీకరణ పనులు చేస్తున్నారు. అయితే, వీటి వ్యవహారం పైన పటారం లోన లొటారం అనే సామెత సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు జీవీఎంసీ సుందరీకరణ పనులు చేసుకుంటూ వెళ్తుంటే ముందు చేసినవి మరమ్మత్తులకు వస్తున్నాయని నగర వాసులు నవ్వుకుంటున్నారు. కొత్తగా భవనాలు కడితే కృంగిపోతున్నాయని.. లైటింగ్ ఏర్పాటు చేస్తే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు వెలగడం లేదని వాపోతున్నారు. ఈ పనులు తీసుకున్న కాంట్రాక్టర్లు, సంస్థలు అతి తక్కువకు దక్కించుకొని మరీ నాసిరకంగా పనులు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కూడా కళ్ళ ముందే కనిపిస్తున్నది. ఓల్డ్ మోడల్ లో ఉన్న బస్ స్టాండల రూపు రేకలు మార్చాలని.. ‘బస్ బే’ అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీలోని 99 వార్డులలో బస్ స్టాండ్ల రూపు రేఖలు మార్చాల్సి ఉంది. పాతగా ఉన్న బస్ స్టాండ్లను నూతనంగా మార్చి ఇతర దేశాలలో ఉన్న స్థాయిలో కనిపించేలా అభివృద్ధి చేయాలన్నది దీని కాన్సప్ట్. మరీ పాత బడిన వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు రూ.40 నుండి రూ.50 లక్షల వరకూ కూడా ఒక్కో దానికి బడ్జెట్ కేటాయించగా.. అన్నీ బాగున్న బస్ స్టాండ్లకు కనీసం బస్ బే అని డిజిటల్ గా మార్చేందుకు రూ.40 నుండి రూ.50 వేలు కేటాయించారు. ఈ క్రమంలో ఇలా భవనంతో సహా నిర్మించిన రెండు మూడు బస్ బేలను నగర మేయర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇది చూడడానికి అందంగా, సరికొత్తగా ఫారిన్ మోడల్ గా ఉండడంతో ఇదేదో బాగుందని అంతా అనుకున్నారు.
అయితే, ఇంకా ఈ ప్రాజెక్ట్ పూర్తి కానేలేదు. కొన్ని చోట్ల పనులు సాగుతూనే ఉన్నాయి. అంతలోనే సిటీ నడిబొడ్డున కట్టిన బస్ షెల్టర్ ఒకటి కుంగిపోయింది. ఒక్కసారిగా అది పక్కకు ఒరిగిపోయింది. ఆ టైంలో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం లేదు. ప్రయాణికులు ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే సంభవించేదని అంటున్నారు. కాగా, నలభై లక్షల రూపాయలతో నిర్మించిన ఈ బస్ షెల్టరును కూడా మేయరే ప్రారంభించారు. కానీ, ఇప్పుడు ఇలా ఒక్కసారిగా ఇది కృంగిపోయింది. ఇది ఒక్కటే కాదు.. చాలా చోట్ల ఇదే పరిస్థితి. బస్ బే అని ఫారిన్ కంట్రీలో ఉన్నట్లు కనిపించాలని పెట్టిన బోర్డులు కూడా కొన్ని చోట్ల ఊడి వేలాడుతున్నాయి. ఈ మోడ్రన్ బస్ స్టేషన్ల పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణం భారీ అవినీతి అంటూ విపక్షాలు గట్టిగా విమర్శలు చేస్తున్నాయి. బస్ స్టాండే కట్టలేని వారు మూడు రాజధానులు కడతారా, పోలవరం కట్టగలరా అంటూ భారీ సెటైర్లే వేస్తున్నాయి.