తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆయన చెప్పు కొచ్చారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశామని తెలిపారు.. సీఎం కేసీఆర్ సంపద సృష్టించి పేదలకు పంచుతున్నారని వేముల వెల్లడించారు. తెలంగాణకు బీఆర్‌ఎస్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
నిజామాబాద్ లో ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తా అంటే కవితమ్మను ఓడగొట్టుకున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. యువతకు దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు దండుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. గ్రామ గ్రామానా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తున్నాం.. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది మంత్రి ప్రశ్నించారు. తొమ్మిది సంవత్సరాల క్రితం 400 ఉన్న సిలిండర్ ధర బీజేపీ ప్రభుత్వం వచ్చాక 1200 రూపాయలకు చేసిందని ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది ప్రజలకు తెలుసు.. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మితే మళ్లీ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.