ఇండియా కూటమిలోకి వైసీపీ.. పీకే మధ్యవర్తిత్వం? | pk mediation for ycp to joinindia| ap| politics| jagan| bjp
posted on Aug 28, 2023 4:44PM
ఏదో ఒకటి చేయాలి.. మరోసారి అధికారంలోకి రావాలి. ఇప్పుడు అధికారం కోల్పోతే మళ్ళీ అవకాశం రావడం అసాధ్యం. ఈసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే రాజధాని, పోలవరాన్ని పరుగులు పెట్టించడం ఖాయం. అవి రెండూ పూర్తయితే ఏపీలో మళ్ళీ వైసీపీకి అవకాశం దక్కడం దుర్లభం. అందుకు ఇప్పుడే మరోసారి అధికారాన్ని దక్కించుకొని ఏపీ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలన్నది జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆయన నాలుగేళ్ళపాలనతోనే ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు.
ఎక్కడికక్కడ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు సర్వేలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అధికారం టీడీపీదేనని ఆ సర్వేలు తేల్చేయడంతో వైసీపీ వర్గాలలో గుబులు రేగుతున్నది. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్.. ఇప్పటికే పలు విధాలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎత్తులు వేస్తున్నారు. సొంత మీడియాతో పాటు పలు సంస్థలు సర్వేల ద్వారా వైసీపీకి అనుకూలంగా భారీ ఎత్తున మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందాలు జగన్ విజయమే లక్ష్యంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం కసరత్తులు మొదలు పెట్టాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏకమైతే వైసీపీకి అధికారం దక్కడం అసాధ్యమన్న భావనలో ఉన్న వైసీపీ పెద్దలు విపక్షాల ఐక్యతను భగ్నం చేయడానికి శతధా ప్రయత్నిస్తున్నాయి. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని జనసేన నేతలపై పరుష వ్యాఖ్యలకు దిగుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా టీడీపీతో కలిస్తే కేంద్రంలో తమ పప్పులు ఉడకవని భయపడుతున్న వైసీపీ.. బీజేపీతో రహస్య స్నేహబంధం కొనసాగేలా చూసుకోవాలని తాపత్రయ పడుతుంది.
చాలాకాలంగా టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బీజేపీ పెద్దలు కూడా వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగడం ఈ పొత్తులపై పాజిటివ్ సంకేతాలనే ఇస్తోంది. దీంతో టీడీపీతో బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్లేనని రాజకీయ వర్గాలలో వినిపిస్తుండగా.. ఇక వైసీపీకి మిగిలింది ఇండియా కూటమే. మరోవైపు కాంగ్రెస్ అధ్వర్యంలోని ఇండియా కూటమి కూడా దక్షణాది రాష్ట్రాలలో తమతో కలిసి వచ్చే వారి కోసం గేట్లు తెరిచి ఆహ్వానిస్తుంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఇప్పుడు మరో కొత్త ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. అదే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలోకి వైసీపీ చేరే ప్రయత్నాలు సాగుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి.
జగన్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఈ మేరకు మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నది. కాగా, ఈ మధ్యనే పీకే చంద్రబాబుతో భేటీ అయ్యారన్న ప్రచారం ఒకటి బయటకి వచ్చింది. ఇండియా కూటమిలోకి చేరేందుకు చంద్రబాబు పీకేతో చర్చలు జరిపారని ఈ ప్రచారం సారాంశం. అయితే, నిజానికి ఇండియా కూటమిలోకి సన్నాహాలు చేసుకుంటున్నది వైసీపీయేనని, వారు చేసే పనుల్ని ఇతర పార్టీలు చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారంలోకి తీసుకురావడం జగన్ మోహన్ రెడ్డి రివర్స్ వ్యూహంలో భాగమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. త్వరలోనే ఇండియా కూటమిలోకి వైసీపీ అనే పొలిటికల్ ఇష్యు బయటకొస్తుందన్నది ఎ చెప్తున్నారు. మరి అదే నిజమైతే బీజేపీ ఎలా స్పందిస్తుందన్నదని చూడాల్సి ఉంది.