Leading News Portal in Telugu

CPL 2023: సిక్సర్ల మోత.. ఊచకోత మాములుగా లేదు


వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను సునాయాసంగా బౌండరీలు కొట్టగలడని తెలుసు. గతంలో ఐపీఎల్ లో ముంబై జట్టు తరుఫున ఆడిన ఈ స్టార్ ప్లేయర్.. ఎన్నో మ్యాచ్ లను గెలిపించిన సందర్భాలున్నాయి. అయితే కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు పొలార్డ్.

పొలార్డ్ దూకుడు బ్యాటింగ్ తో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తమ ఖాతా తెరిచింది. లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. సెయింట్స్‌ కిట్స్‌ బ్యాటర్లలో రుథర్‌ఫర్డ్‌(38 బంతుల్లో 62 నాటౌట్‌) చెలరేగాడు. అటు నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రావో రెండు వికెట్లు తీశారు.

ఆ తర్వాత 179 పరుగుల టార్గెట్ తో దిగిన నైట్ రైడర్స్ చితక్కొట్టింది. 17.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లలో పూరన్‌, పొలార్డ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో పూరన్‌ 61 పరుగులు చేయగా.. పొలార్డ్‌ 16 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ ఇజారుల్హక్ నవీద్‌ను ఓ ఆట ఆడుకున్నాడు పొలార్డ్‌. ఇజారుల్హక్ వేసిన 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.