జగనన్నను మించిన దైవమున్నదా? రోజా కొత్త భజన | roja croses limits in praising jagan| minister| vidya| deevena| nagari
posted on Aug 28, 2023 3:36PM
కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ
ఇతడే దిక్కని మొక్కని వాడికి
దిక్కు మొక్కు లేదండండీ
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఈ కొత్త దేముడి భజన వేరే లెవల్ లో సాగుతోంది. ఇంతకీ ఈ కొత్త దేముడెవరంటారా? సందేహమెందుకు వైసీపీ నేతలు, మంత్రులూ చెబుతున్న కొత్త దేముడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డే. అవును ఎన్నికల సమయం ముంచుకు వస్తున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత పీక్స్ లో ఉంది. కేసులు, అరెస్టులు, లాఠీ దెబ్బలు, పథకాల కోత బెదరింపులు ఇవేవీ ప్రజల మీద పని చేయడం లేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలలో మరోసారి విజయం సాధించాలంటే కొత్త ముఖాలను ఎన్నికల బరిలో దింపడం వినా మరో మార్గం లేదని భావిస్తున్నారు. దీంతో సీనియర్లు, జూనియర్లు, మంత్రులు, మాజీ మంత్రులు అన్న తేడా లేకుండా వైసీపీలో చాలా మంది సిట్టింగులకు టికెట్ భయం పట్టుకుంది. ప్రజలలో పలుకుబడి ఉన్న వారు టికెట్ రాకపోతే పార్టీకి గుడ్ బై కొట్టేసి వెళ్లి పోతారు. అధినేత తీరు నచ్చకపోయినా ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసి పార్టీ వదిలేస్తారు. కానీ కొందరు మంత్రులు, మాజీ మంత్రులకు ఆ పరిస్థితి లేదు. అందుకే వారు తమ అధినేతను కొత్త దేముడిగా, కొంగొత్త దేవుడిగా కీర్తిస్తూ టెకెట్ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో రోజు చేసిన ప్రసంగం వింటే ఈ తరహా భజనలో ఆమె ఆరితేరారని అనిపించక మానదు. నగరిలో సోమవారం (ఆగస్టు 28) జగనన్న విద్యాదీవెన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రోజా ప్రసంగించారు. ఆకాశమే హద్దుగా పొగడ్తల వర్షం కురిపించేశారు. నగరి నియోజకవర్గానికి జగన్ తొలిసారిగా విచ్చేశారని చెప్పిన మంత్రి రోజా జగనన్నను మించి దైవమున్నాదా అన్న రీతిలో పొగడ్తల వర్షం కురిపించేశారు. పనిలో పనిగా విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలూ గుప్పించేశారు. ఇక జగన్ విషయంలో ఆమె ప్రశంసలు అన్ని హద్దులనూ మీరిపోయాయి. జగన్ ను కొత్త దేముడిని చేసేశాయి. ఆమె ఏ స్థాయిలో నేత విడిచి సాము చేశారంటే ‘మీరు రాముడిని పూజించినా… అల్లా ను ఆరాధించినా, ఏసు ప్రభువును ప్రార్ధించినా… మిమ్మల్ని ఉన్నత విద్యలు చదివించేది మాత్రం ఆ దేవుడు పంపిన జగనన్నే’అనేశారు. అదే వేదిక మీద కూర్చున్న జగన్ ఈ ప్రసంగం వింటూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
ఇంతకీ రోజాకు పొగడ్తలు కొత్తేమీ కాదు. గతంలో తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ఈ స్థాయికి పెద్దగా తగ్గకుండానే ఆమె చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. అదే సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ తరువాత తెలుగుదేశం వీడి కాంగ్రెస్ పంచన చేరుందుకు ప్రయత్నించిన సమయంలో వైఎస్ పైనా పొగడ్తలు కురిపించారు. ఇప్పుడు జగనన్న ను పొగుడుతున్నారు. అయినా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కుతుందా లేదా అన్న టెన్షన్ లో ఉన్న రోజా జగన్ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగడితే పాస్ మార్కులు పడతాయని భావిస్తున్నట్లున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
నగరిలో ప్రస్తుతం రోజాకు ఎదురుగాలి వీస్తున్నదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డితో పొసగకపోవడం, నియోజవకర్గంలో కూడా ఆమెకు వ్యతిరేకంగా పని చేసే గ్రూపు పెద్దిరెడ్డిఆశీస్సులతో బలోపేతం కావడంతో ఆమెకు ఒకింత చిక్కులు తప్పడం లేదని అంటున్నారు. ఇక అన్నిటికీ మించి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఆమెకు కనీస సమాచారం అందని పరిస్థితి ఉందని చెబుతున్నారు. వీటన్నిటికీ మించి గతంలో గడపగడపకూ కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్ లో పని తీరు మెరుగుపరచుకోవాలంటూ జగన్ మందలించిన నేతలలో రోజా కూడా ఒకరని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో నగరి నియోజకవర్గ వైసీపీ టికెట్ రోజాకు దక్కే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న గుసగుసలు వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్న నేపథ్యంలో రోజా జగన్ పై ప్రశసంల వర్షం కురిపించడం, అపర దేవుడిగా కీర్తించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ టికెట్ కోసం కోటి విద్యలు అంటూ వైసీపీ శ్రేణుల నుంచే సెటైర్లు పేలుతున్నాయి.