Leading News Portal in Telugu

గన్నవరం సరే.. గుడివాడ మాటేంటి? | gannavaram ok what about gudiwada| kodali| nani| tdp| candidate| announce| party| cadre


posted on Aug 28, 2023 1:05PM

గన్నవరం  ఇన్‌ఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావ్ పేరు ప్రకటించిన తెలుగుదేశం  పార్టీ అభ్యర్థి ఆయనేనన్న క్లారిటీ పార్టీ శ్రేణులకు ఇచ్చేసింది.  అయితే గన్నవరం నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న గుడివాడ నియోజకవర్గం విషయంలో మాత్రం ఇంకా పార్టీ ఇన్ చార్జ్ నియామకం విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. దీంతో  అక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగేదెవరన్న విషయంలో క్లారిటీ లేక తెలుగుదేశం శ్రేణులు అయోమయంలో ఉన్నాయి.  గుడివాడలో  తెలుగుదేశం నాయకులు రావి వెంకటేశ్వరరావు, ఎన్నారై వెనిగండ్ల రాము.. ఎవరికీ వారు  పార్టీని ప్రజలలోకి తీసుకువేళ్లేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.  రానున్న ఎన్నికల్లో వీరిద్దరిలో ఎవరికి సీటు వస్తుందనే విషయంలో పార్టీలో ఒకింత అయోమయం నెలకొని ఉంది.  వీరిద్దరిలో ఎవరో ఒకరికి సీటు ఇస్తారా? లేకుంటే మ కొత్త వారిని తీసుకు వచ్చి గుడివాడ అసెంబ్లీ సీటు అప్పగిస్తారా? అదీ ఇదీ కాకుంటే.. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఇక్కడ నుంచి బరిలోకి దింపే అవకాశాలున్నాయా? అనే సందేహాలు నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.  గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని.. వరుసగా నాలుగు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  తొలుత రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగానే గెలుపొందినా.. ఆ తర్వాత ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకుని మరో రెండు సార్లు విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో  వైసీపీ అధికారంలోకి రాగానే గన్నవరం ఎమ్మెల్యే కొడాలి నానికి జగన్ తన కేబినెట్ లో స్థానం కల్పించారు.  

అయితే తొలిసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపైనే కాకుండా ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై కొడాలి నాని బూతులతో విరుచుకుపడారన్న సంగతి తెలిసిందే.  అంతేకాకుండా   గుడివాడ నా అడ్డా.  ఇక్కడ నుంచి ప్రతిపక్ష పార్టీల తరఫున ఎవరు బరిలో నిలిచినా.. గెలిచేది మాత్రం నేనే అంటూ.. పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ లాగా తగ్గేదే లే అన్న స్టైల్లో కొడాలి నాని పంచ్ డైలాగులు విసురుతుండటం కద్దు. దీంతో గుడివాడలో కొడాలి నానికి పోటీగా సరి అభ్యర్థిని  బరిలోకి దింపితే తప్ప ఇక్కడ తెలుగుదేశం విజయకేతనం ఎదురవేయడం కష్టమన్న అభిప్రాయం క్యక్తమౌతోంది. 

ఎందుకంటే.. దాదాపు రెండు దశాబ్దాలుగా  కొడాలి నాని.. గుడివాడ ఎమ్మెల్యేగా,   దాదాపు మూడేళ్ల పాటు మంత్రిగా కూడా పని చేశారు. కానీ గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం నోచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కనీసంలో కనీసంగా గుడివాడ బస్టాండ్ అయినా ఆయన బాగు చేస్తే సరిపోయేదని..  ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. 2021 జులై మొదటి వారంలో గుడివాడ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం అప్పటి రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో కలిసి..   మంత్రి హోదాలో కొడాలి నాని  శంకుస్థాపన కూడా చేశారని.. అంతేకాదు.. ఈ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం కోట్ల రూపాయిలు కేటాయించామని ఈ సందర్భంగా ప్రకటించారు. కానీ రెండేళ్లు గడిచినా.. నేటికీ గుడివాడ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం కనీసం ఒక ఇటుక రాయి కూడా పడలేదంటే.. గుడివాడ లొ ప్రగతి పురుగతి ఏంటన్నది సువువుగానే అవగతమౌతుంది.  

దీంతో రెండు దశాబ్దాలుగా కొడాలి నాని నియోజకవర్గ అభివృద్ధికి వీసమెత్తు పని కూడా చేయలేదనీ,  అలాంటి కొడాలి నానిని ఓటమి పాలు చేసేందుకు జస్ట్ కొద్దిగా కష్టపడితే చాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. గుడివాడ ప్రజలు నానిని ఓడించి ఇంటికి పంపడానికి రెడీ ఉన్నారని అంటున్నారు. అందుకే జాప్యం లేకుండా గుడివాడలో   తెలుగుదేశం అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగించడం సరికాదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అందుకే గుడివాడ నుంచి పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..  వెంటనే ప్రకటించేస్తే.. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావ్ పేరు ప్రకటించినట్లు.. గుడివాడలో కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీ పేరు ప్రకటిస్తే.. ఆ తర్వాత వ్యవహారాన్ని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులే చూసుకుంటాయని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.