US అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారుగా టెస్లా, X (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ ను కోరుకుంటానని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. ఈ మేరకు అయోవాలోని ఒక టౌన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన సంభావ్య అధ్యక్ష పదవికి సలహాదారులుగా ఎవరు కావాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు.
తన పరిపాలనలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను సలహాదారుడిగా నియమిస్తానని వివేక్ రామస్వామి అన్నారు. అందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. ‘‘అమెరికాకు నేను ఏమి చేయాలనుకుంటున్నాను అనే దానికి ట్విటర్ మంచి ఉదాహరణ. గతేడాది ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. అందువల్ల నేను గెలిస్తే.. ఆయననే ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తా. ట్విటర్ మాదిరిగానే ప్రభుత్వాన్ని కూడా ఆయన సమర్థవంతంగా నడిపించగలరు’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇటీవల మస్క్ చైనా పర్యటనను వివేక్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే, అందుకు భిన్నంగా వివేక్ నమ్మకమైన అభ్యర్థి అంటూ మస్క్ కొనియాడారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో రామస్వామి పేరు మారుమోగుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రోజురోజుకూ ఆయన ప్రాచుర్యం పెరుగుతోంది. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీ పడుతున్న మరో ఇండియన్-అమెరికన్. వివేక్ రామస్వామి యేల్ నుంచి న్యాయ పట్టా పొందే ముందు హార్వర్డ్‌లో జీవశాస్త్రాన్ని అభ్యసించారు. ఫోర్బ్స్ ప్రకారం, కొంతకాలం బిలియనీర్‌గా ఉన్న ఆయన సంపద స్టాక్ మార్కెట్ తిరోగమనంతో 950 మిలియన్ డాలర్లకు పడిపోయింది.