Leading News Portal in Telugu

Nag: తెలుగు సినిమా రాతని మార్చిన ఈయన్ని కింగ్ అనకుండా ఎలా ఉంటారు?


ఈరోజు తెలుగు సినిమా బౌండరీలు దాటి మార్కెట్ పెంచుకుంది, మన మేకింగ్ స్టాండర్డ్స్ కి హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పుడున్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరినీ ఇన్స్పిరె చేసింది నిస్సందేహంగా రామ్ గోపాల్ వర్మ మాత్రమే. మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినిమా మత్తుని వదిలించిన వాడు రామ్ గోపాల్ వర్మ. మేకింగ్ అంటే ఇలా ఉండాలి, సౌండ్ ని ఇలా వాడాలి, లైటింగ్ ఇలా చేయాలి, కెమెరా ఇలా కదలాలి అని చేసి చూపించి తెలుగు సినిమా మాత్రమే కాదు ఇండియన్ సినిమా మేకింగ్ ని పూర్తిగా మార్చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ ఇంత గొప్ప వాడు అయితే అతనిలోని టాలెంట్ ని గుర్తించి, అతనికి మొదటి అవకాశం ఇచ్చిన నాగార్జున విజన్ ఇంకెలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మని నమ్మి నాగార్జున చేసిన శివ సినిమా ఇండియన్ సినిమా ఫేట్ ని మార్చేసింది. ఆర్జీవీని మాత్రమే కాదు నాగార్జున ఏ కొత్త దర్శకుడితో టాలెంట్ ఉన్నాఅందరికన్నా ముందు గుర్తించి అవకాశం ఇచ్చేవాడు. అందుకే నాగార్జున చేసినన్ని ప్రయోగాలు, నాగార్జున ఇంట్రడ్యూస్ చేసినంత మంది కొత్త దర్శకులని ఇంకొకరు ఇంట్రడ్యూస్ చేయలేదు.

మూడున్నర దశాబ్దాల సినిమా కెరీర్ లో ఇప్పటివరకూ 98 సినిమాలు చేసిన నాగార్జున, దాదాపు 42 మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. ఈరోజు అనౌన్స్ అవ్వనున్న 99వ సినిమాతో 43వ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. డైరెక్టర్స్ ని మాత్రమే కాదు నాగార్జున దాదాపు 100 మంది కొత్త టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి ఇచ్చాడు. నాగార్జున ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ లిస్టులో మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, ఫాజిల్, మహేష్ భట్, వైవీఎస్ చౌదరి, వీఆర్ ప్రతాప్, ఆర్ ఆర్ షిండే, దశరథ్, సూర్య కిరణ్, లారెన్స్, కళ్యాణ్ కృష్ణ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు. ఈరోజు లారెన్స్  లాంటి ఖోరియోగ్రాఫర్, వంద కోట్ల హీరో-డైరెక్టర్ గా మారాడు అంటే అది నాగార్జున ఇచ్చిన సపోర్ట్ కారణంగానే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కెరీర్ ఆసాంతం తన మార్కెట్ ని రిస్కుతో పెడుతూ కొత్త టాలెంట్ కి అవకాశాలు ఇస్తున్న ఉన్న ఏకైక హీరో నాగార్జున మాత్రమే, అందుకే ఆయన్ని కింగ్ అంటారందరు.