Leading News Portal in Telugu

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబ్ బెదిరింపు.. ఏ క్షణంలోనైనా పేలొచ్చంటూ కాల్..!



Shamshabad

Shamshabad: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. విమానాశ్రయంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఏ క్షణంలోనైనా పేలుస్తానని బెదిరించాడు. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. జీఎంఆర్ కస్టమర్ సపోర్ట్ కి టెర్రరిస్ట్@జీమెయిల్ డాట్ కామ్ పేరుతో మెసేజ్ రావడం, ఎయిర్‌పోర్ట్ లో రాత్రి ఏడు గంటలకు పేల్చేస్తామంటూ మెయిల్ రావడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. సిఐఎస్ఎఫ్ క్విక్ రియాక్షన్ టీమ్, బాంబు‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు. కాగా.. కొద్దిసేపటికే కస్టమర్ సపోర్ట్ కి మరో మెయిల్ వచ్చింది. తన కుమారుడికి మానసిక‌ స్థితి సరిగ్గా లేదని, తన కుమారుడిని క్షమించాలంటూ ల్యూట్@జీమెయిల్ డాట్ కామ్ తో మరో మెయిల్ రావడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టమర్ సపోర్ట్ కి వచ్చిన మెయిల్ వెస్ట్ బెంగాల్ నుండి వచ్చినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి ఆర్జీఐఏ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని నిర్ధారించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ నెల 30 వ తేదీ వరకు హై అలెర్ట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read also: Vijayawada Crime: నిద్రపోతున్న భర్త.. వేడినీళ్లు పోసిన భార్య

గతంలో కూడా శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఒక ప్రయాణికుడు తాను షెడ్యూల్ చేసిన విమానాన్ని మిస్ అవుతాననే మోసపూరిత ఆలోచనతో బాంబు బెదిరింపు కాల్ చేశాడు. చివరకు అతడిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అజ్మీరా భద్రయ్య చెన్నైలో సీనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సి ఉండగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే.. భద్రయ్య విమానాశ్రయానికి రావడం కాస్త ఆలస్యమైంది. బోర్డింగ్ సమయం ముగియడంతో విమానాశ్రయానికి వచ్చిన అతడిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్లైట్ మిస్ కాకూడదని భావించిన భద్రయ్య.. ఎయిర్ పోర్ట్ అధికారులకు ఫోన్ చేసి చెన్నై-హైదరాబాద్ ఇండిగో విమానంలో బాంబు పెడతానని బెదిరించాడు. వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమై కాల్‌పై ఆరా తీశారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి విమానాశ్రయంలో ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. జీపీఎస్‌ ఆధారంగా భద్రయ్యను పట్టుకున్నారు. తాను ఫ్లైట్ మిస్ కాకూడదనే బెదిరింపు కాల్ చేశానని నిందితుడు అంగీకరించాడు.
Raksha Bandhan: రాఖీ కట్టడానికి సరైన రోజు.. శుభ సమయం ఏంటో తెలుసా?