Leading News Portal in Telugu

Mahabubabad SP: మహబూబాబాద్‌ ఎస్పీ సడెన్ ట్రాన్స్‌ఫర్.. బదిలీలో రాజకీయ కోణమా..?


Mahabubabad SP: మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహబూబాద్ జిల్లా ఎస్పీ బదిలీపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణలో ప్రస్తుతం సాధారణ బదిలీలు లేనప్పటికీ రాజకీయ కారణాలతోనే ఎస్పీని బదిలీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే అల్లుడు కావడం వల్లే ఆయనపై బదిలీ పడింది అనే చర్చ సాగుతోంది.

వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్ సోమవారం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ (కమాండ్ కంట్రోల్) ఎస్పీగా పనిచేస్తున్న గుండేటి చంద్రమోహన్‌ను ఎస్పీగా నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ కు ఎస్పీ శరత్ చంద్ర పవార్ అల్లుడు. డిసెంబర్ 26, 2021న మహబూబాబాద్ ఎస్పీగా శరత్‌చంద్ర పవార్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన హఠాత్తుగా బదిలీ కావడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించినా రేఖానాయక్ పేరు జాబితాలో లేదు. ఆమె స్థానంలో భూక్యా జాన్సన్‌ నాయక్‌కు టికెట్‌ కేటాయించారు.

దీంతో ఆమె పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం తనను మోసం చేసిందని మండిపడ్డారు. మంత్రి పదవి డిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే టికెట్ ఇవ్వలేదని రేఖా నాయక్ అన్నారు. టిక్కెట్ ఇవ్వకున్నా మళ్లీ పోటీ చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. గాంధీభవన్‌లో ఆమె తరపున దరఖాస్తు కూడా సమర్పించారు. రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు రేఖా నాయక్ సోమవారం ప్రకటించారు. తాను కాంగ్రెస్ నుంచి వచ్చానని, మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్తానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతానని అన్నారు. ఆమె ప్రకటన చేసిన కొద్దిసేపటికే మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న ఆమె అల్లుడు శరత్‌చంద్ర పవార్‌ను హఠాత్తుగా బదిలీ చేశారు. కోడలుపై అత్త కోపాన్ని ప్రదర్శించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Shamshabad Airport: నీ తెలివి తగలెయ్య.. ఎక్కడా ప్లేస్ లేనట్లు అక్కడ బంగారం దాచడం ఏంట్రా..!