Leading News Portal in Telugu

విద్యాదీవెన బటన్ నొక్కుడు కార్యక్రమంలోనూ జగన్ అదే తీరు! | same old speach in nagari| jagan| vidyadeevena| babu| criticise| ycp| failures| funds| scheme| phased| manner| meeting| crore


posted on Aug 29, 2023 11:01AM

సీఎం జగన్ సోమవారం(ఆగస్టు 29) చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించారు. జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులు విడుదల చేశారు. బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి నిధులు బదిలీ చేసినట్లు జగన్‌ ఘనంగా చాటుకున్నారు. అయితే ఆయన బటన్ అయితే నొక్కేశారు కానీ సదరు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ విద్యాదీవెన డబ్బులు ఇంకా నాలుగు వాయిదాలు చెల్లించాల్సి ఉంది.  విద్యాదీవెన అనేది వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఒక పథకం. గతంలో ఇలా ప్రభుత్వాలు ఏదైనా ఒక పథకం తీసుకొస్తే.. ఆ పథకం ప్రారంభించే సమయంలో అట్టహాసంగా సభ ఏర్పాటు చేసి ప్రజలకు దానిపై వివరణ ఇచ్చే వారు.  కానీ  వైసీపీ ప్రభుత్వం మాత్రం పథకం ప్రారంభంతో పాటు దాన్ని విడతల వారీగా అమలు చేస్తూ..  ప్రతి విడతకు అట్టహాసంగా, ఆర్భాటంగా  సభలు నిర్వహించి ఆ సభల నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. అమ్మ ఒడి,  రైతు భరోసా, విద్యా దీవెన ఇలా ఏ పథకం తీసుకున్నా అంతే. అన్నీ పథకాల సొమ్ములూ విడతల వారీగా ఇవ్వడం.. అలా ఇస్తున్న ప్రతి విడతకి కోటాను కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ కు   ఆనవాయితీగా మారిపోయింది.

 తాజాగా నగరిలో నిర్వహించిన కార్యక్రమం కూడా అంతే. విద్యాదీవెన ఒక విడత నిధులను విడుదల చేస్తున్నట్లు బటన్ నొక్కి చెప్పారు. ఒక్క పథకాన్ని నాలుగు వాయిదాల్లో అమలు చేస్తూ.. నాలుగు సార్లు బటన్లు నొక్కడానికి కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు, బహిరంగసభలు ఏర్పాటు చేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీ ప్రచారం కోసం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వాడుతున్నారు. ఇక, నగరి సభలో సీఎం జగన్  ప్రసంగం కూడా అక్షరం పొల్లుపోకుండా  పాత పాటే పాడారు. యధావిధిగా చంద్రబాబు దుర్మార్గుడు, మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. కుట్రలు, కుతంత్రాలు చేసి గెలవాలని చూస్తున్నారంటూ అదే ఊక దంపుడు ప్రసంగం చేశారు.   పుంగనూరు, అంగళ్లలో కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించి చంద్రబాబు లబ్ధి పొందాలని చూశారని.. పోలీసులపై దాడులు చేయించారని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన ఫొటోకే దండ వేసిన చంద్రబాబు.. ఇప్పుడు నాణెం విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని విమర్శలు చేశారు. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు ఫిర్యాదుపై మాట్లాడిన సీఎం జగన్.. చంద్రబాబే దొంగ ఓట్లు సృష్టించి ఆయనే ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. 

గత  నాలుగేళ్ళలో సీఎం జగన్ దాదాపుగా ఇదే పాట పాడుతున్నారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నట్లుగా తన వైఫల్యాలన్నిటకీ   చంద్రబాబే కారణమని.. కోర్టుల నుండి దర్యాప్తు సంస్థల వరకూ అన్నిటినీ చంద్రబాబే మేనేజ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  బహుశా తొలి రోజు నుండి సీఎంకు స్క్రిప్ట్ రాసిచ్చే వారికి కొత్తగా ఏం రాయాలో తెలియలేదేమో పాపం..  అదే పాత క్యాసెట్ ముందుకీ వెనక్కీ తిప్పి ప్లే చేస్తున్నారు. ఇక జగన్ ఆరోపణల విషయానికి వస్తే పుంగనూరు, అంగళ్లలో ఏం జరిగిందో అందరూ చూసారు. కేసులు కూడా పెట్టారు. వైసీపీ రౌడీల దౌర్జన్యాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ఓట్ల తొలగింపుపై ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘమే విచారించి అధికారులపై వేటు కూడా వేసింది. ఈ తతంగాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారుప.  స్థానిక సంస్థల ఎన్నికల నుండి ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ పక్క రాష్ట్రాల నుండి వైసీపీ నేతలు మనుషులను తరలించి భారీగా దొంగఓట్లు వేయించిన వైనం కూడా వీడియోల ద్వారా రాష్ట్రప్రజలు వీక్షించారు.  

అయినా, జగన్ మాత్రం చంద్రబాబే ఇవన్నీ చేయించారని చెప్పడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. జగన్ మోహన్ రెడ్డి వాలకం చూస్తుంటే జనం ఏం చెప్పినా వింటార్లే అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఇలా అన్నిటికీ చంద్రబాబే అంటున్నారు. అదే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన నుండి విశాఖ సభ, బస్సు యాత్రలో చేసిన సాంకేతిక ఆరోపణలకు, లోకేష్ పాదయాత్రలో సంధించిన ప్రశ్నలకు ఒక్కటంటే ఒక్క దానికి కూడా సమాధానం రావడం లేదు. విపక్ష నేతగా ఉన్నప్పుడు అస్తమానూ నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ డైలాగులు దంచిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత   ప్రజలకు మేము ఇది చేశాం.. ఈ అభివృద్ధి సాధించాం అని చెప్పుకోవడానికి ఏమీ కనిపించడం లేదు. దీంతో ఆయన ఎంతసేపూ చంద్రబాబు సెంట్రిక్ గా పరమ రొటీన్ ఆరోపణలు. విమర్శలు గుప్పిస్తూ తన భుజాలను తానే చరుచుకుంటున్నారని,  ప్రజలు అన్నీ చూస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.