Leading News Portal in Telugu

World Cup 2023: ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును ప్రకటించేది ఆ రోజే!


BCCI set to announce India Team for World Cup 2023 on September 3: 2011 తర్వాత భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2023 జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే చాలా దేశాలు తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును సెప్టెంబర్ 3న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అనంతరంబీసీసీఐ జట్టుని ప్రకటించనుందట.

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ 2023 కోసం సిద్ధమవుతోంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 30న ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో భారత్ కీలక మ్యాచ్ ఆడుతుంది. ఆసియా కప్ తర్వాత భారత్ కీలక టోర్నీ ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతోంది. ఈసారి సొంత గడ్డపై జరుగుతుండడంతో ఎలాగైనా కప్ సాధించాలనే కసితో ఉంది. ఆసియా కప్‌ 2023లో ఆడే జట్టే దాదాపుగా ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. 2-3 మార్పులు మినహా అదే జట్టు ఉండనుందని మాజీలు కూడా అంటున్నారు.

వన్డే ప్రపంచకప్ 2023కి జట్లను ప్రకటించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 5. సెప్టెంబర్ 27 లోగా జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ఇంకా ప్రకటించని బీసీసీఐ.. సెప్టెంబర్ 3న ప్రకటించే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు ప్రపంచకప్‌కు బీసీసీఐ జట్టును ఎంపిక చేస్తారని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.