Leading News Portal in Telugu

G20 Summit: మౌర్య షెరటన్‌లో బైడెన్.. తాజ్ ప్యాలెస్‌లో జిన్‌పింగ్..


G20 Summit: వచ్చే నెలలో జరగబోతున్న జీ20 సమావేశాలకు భారత్ వేదిక కాబోతోంది. జీ20 దేశాధినేతలు ఇండియా రాబోతున్నారు. ఈ క్రమంలో వారిందరికి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలువురు దేశాధినేత బస కోసం ప్రముఖ హోటళ్లు బుక్ అయ్యాయి. దేశాధినేతలు, ప్రముఖులకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ లోని 30కి పైగా ప్రముఖ హోటళ్లు ఆతిథ్యం ఇస్తాయి.

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఐటీసీ మౌర్య షరటన్‌లో ఉండనున్నారు. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ తాజ్ ప్యాలెస్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తంగా ఢిల్లీలోని 23 హోటళ్లు, ఎన్‌సీఆర్ లోని 9 హోటళ్లు ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

బైడెన్ బస చేసే ఐటీసీ మౌర్య హోటల్ లోని ప్రతీ అంతస్తులో అమెరికన్ సీక్రెట్ సర్వీస్ కమాండోలు ఉంటారు. ఆయన బస చేసే ఫ్లోర్ చేరుకునేందుకు ప్రత్యేక లిఫ్ట్ ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. అయితే దీనికి మూడు రోజుల ముందే అమెరికన్ సీక్రెట్ సర్వీస్ స్వ్కాడ్ ఢిల్లీకి చేరుకుంటుంది.

విదేశీ అతిథులు భద్రత కోసం కేంద్ర పారామిలటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జి కమాండోలు, ఢిల్లీ పోలీసు బృందాలు పాల్గొంటాయి. అన్ని భద్రతా ఏజెన్సీల కమాండోలకు వేర్వేరు బాధ్యతలను అప్పగించారు. భద్రతా చర్యలపై ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. జీ20 ప్రతినిధుల భద్రత కోసం యాభై మంది సీఆర్ఫీఎఫ్ గార్డులను నియమించనున్నారు. విదేశీ అతిథుల భద్రత కోసం గ్రేటర్ నోయిడాలోని వీఐపీ సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్‌లో 1,000 మంది సిబ్బందితో కూడిన బృందాన్ని సీఆర్ఫీఎఫ్ ఏర్పాటు చేసింది. అమెరికా, బ్రిటన్, చైనా నుంచి ఇప్పటికే కొన్ని బృందాలు భారత్ చేరుకున్నాయి.

ఢిల్లీలోని ఆతిథ్యం ఇవ్వనున్న హోటళ్లు:

ITC మౌర్య, తాజ్ మాన్సింగ్, తాజ్ ప్యాలెస్, హోటల్ ఒబెరాయ్, హోటల్ లలిత్, ది లోధి, లే మెరిడియన్, హయత్ రీజెన్సీ, షాంగ్రి-లా, లీలా ప్యాలెస్, హోటల్ అశోక్, ఈరోస్ హోటల్, ది సూర్య, రాడిసన్ బ్లూ ప్లాజా, JW మారియట్, షెరటన్ , ది లీలా యాంబియన్స్ కన్వెన్షన్, హోటల్ పుల్‌మాన్, రోసెట్ హోటల్ మరియు ది ఇంపీరియల్.

ఎన్‌సీఆర్ పరిధిలోని హోటళ్లు:
ది వివంత (సూరజ్‌కుండ్), ITC గ్రాండ్ (గురుగ్రామ్), తాజ్ సిటీ సెంటర్ (గురుగ్రామ్), హయత్ రీజెన్సీ (గురుగ్రామ్), ది ఒబెరాయ్ (గురుగ్రామ్), వెస్ట్ఐఎన్ఎన్ (గురుగ్రామ్), క్రౌన్ ప్లాజా (గ్రేటర్ నోయిడా).