Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఇప్పట్లో విముక్తి లభించే అవకాశాలు కనిపించడం లేదు. తోషఖానా అవినీతి కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ కి కింది కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఈ రోజు ఇస్లామాబాద్ హైకోర్టు ఈ శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ పై విడుదలైన కొన్ని గంటల్లోనే ఇమ్రాన్ ఖాన్ ను మళ్లీ అరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. అతడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచి ఆగస్టు 30 బుధవారం రోజు కోర్టులో హాజరపరచనున్నారు.
తాజాగా అధికారిక రహస్యాల చట్టం కింద ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం రహస్యంగా అధికారాన్ని దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ పై 100కు పైగా కేసులు ఉన్నాయి.
తోషాఖానా కేసులో ఈ రోజు ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ కు విముక్తి ప్రసాదించింది. శిక్షను సస్పెండ్ చేసింది. అంతకుముందు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా 5 ఏళ్ల పాటు నిషేధించబడ్డాడు. మరోవైపు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి సైన్యం పూర్తిగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని లేకుండా చేసేందుకు ప్లాన్ చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి.