వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖపట్నంలో చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరుకుంది. అయితే, పాల్ దీక్షను పోలీసులు భగ్నం చేసుందుకు రావడంతో ఆయన ఓవరాక్షన్ చేశాడు. తనకు వైద్యం అక్కర్లేదని, కేజీహెచ్ దగ్గర పోలీసులతో ఆయన గొడవకు దిగారు. అడ్డుకోబోయిన సీఐ కాలర్ ను కేఏ పాల్ పట్టుకున్నాడు. పోలీసులపై అరుస్తూ, కేకలు పెడుతూ నానా హంగామా చేశాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వదిలిపెట్టాలని పాల్ గొడవకు దిగాడు. కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేఏ పాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ఇవాళ ( మంగళవారం ) పోలీసులు భగ్నం చేశారు.
కేఏ పాల్ చేస్తున్న దీక్షా శిబిరం నుంచి ఆయనను బలవంతంగా పోలీసులు తరలించారు. అంబులెన్స్ ఎక్కించి కేజీహెచ్‌కు తీసుకుపోయారు. అయితే ఆసుపత్రికి లోపలికి వెళ్లకుండా గేటు దగ్గరే కేఏ పాల్ పోలీసులతో గొడవకు దిగాడు. ఆరోగ్యంగా ఉన్న తనను ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని పోలీసులను ఆయన ప్రశ్నించారు. తనను చంపేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. నిరాహారదీక్ష విరమణపై యూ టర్న్ తీసుకున్నట్లు పేర్కొన్నాడు. దీక్షను కొనసాగిస్తున్నట్టు ప్రకటన చేశాడు. ఇక, కేఏ పాల్ ను స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో సత్వర న్యాయం కావాలంటూ.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు ఈ దీక్ష కొనసాగిస్తానని కేఏ పాల్ తేల్చి చెప్పారు.