Leading News Portal in Telugu

Chandrayaan-3: 7 రోజులుగా జాబిల్లిపై చంద్రయాన్-3 ఏమి చేసింది?


చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్ రోవర్ ‘ప్రజ్ఞాన్’ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి సరిగ్గా ఒక వారం గడిచింది. లాంచ్‌ వెహికిల్‌ మార్క్‌ (LVM)-3 రాకెట్‌ ద్వారా చంద్రయాన్-3 మిషన్‌ ఈ ఏడాది జూలై 14 నింగిలోకి దూసుకెళ్లగా .. 40 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగింది. ఆ తర్వాత సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగినప్పటి నుంచి ఈ మూన్‌ మిషన్‌ చంద్రుడిపై పరిశోధనలు మొదలుపెట్టింది. మొత్తం 14 రోజుల పాటు ఈ మిషన్ సాగనుండగా, ఇప్పటికే సగం పూర్తయ్యింది. ఉష్ణోగ్రతతో పాటు ఇతర కీలక సమాచారాన్ని ల్యాండర్, రోవర్‌లు పంపించాయి. ఇప్పుడు ఈ మిషన్‌లో కేవలం 7 రోజులే మిగిలి ఉంది.

ఈ క్రమంలో ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్‌-3 మిషన్ ఏమీ చేసిందనే వివరాలను ఇస్రో తెలిపింది. ఆగస్టు 23న చంద్రయాన్-3 జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్‌ అయ్యింది. ఆ తర్వాత కొన్ని గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రగ్యాన్‌ రోవర్‌ బయటికి వచ్చింది. ఆ వెంటనే పని ప్రారంభించింది. ఆగస్టు 24న ల్యాండర్ లోని పేలోడ్స్ ఆన్ అయ్యాయి. ఆగస్టు 25న శివశక్తి పాయింటూ చుట్టూ రోవర్ పని చేయడం మొదలుపెట్టింది.

ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేసింది. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతా మార్పుల వివరాలను మూన్‌ మిషన్‌ ఇస్రోకు చేరవేసింది. ఆగస్టు 28న తన దారికి 4 మీటర్ల లోతు గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్‌ను అనుసరిస్తూ ప్రగ్యాన్‌ రోవర్‌ చాకచక్యంగా తప్పించుకుంది. ఆగస్టు 29న బాగున్నాం అంటూ రోవర్, ల్యాండర్ సందేశం ఇచ్చింది.