Leading News Portal in Telugu

Indonesia: భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.0


Indonesia EarthQuake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బాలి, లోంబోక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఇండోనేషియాలోని మాతరాంకు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా భూ అంతర్భాగంలో 516కిలోమీటర్లు దిగువన కదలలికలు సంభవించాయి.

కాగా భూకంప తీవ్రత 7.1గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. మరోవైపు 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలసీ (NCS) పేర్కొంది. ఇది మాత్రమే కాకుండా వరుసగా ఆ తర్వాత 6.1, 6.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఇవి ఇలావుండగా సముద్రంలో చాలా లోతులో భూమి కంపించడం వల్ల సునామి వచ్చే అవకాశం లేదు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బాలి ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అనే విషయం తెలిసిందే. ఎప్పుడూ ఇక్కడ చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అయితే భూకంపం కారణంగా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో టూరిస్టులు భయభ్రాంతులకే గురయ్యారు. బాలిలోని మెర్క్యూరీ కుటాలోని ఓ హోటల్ లో ఉన్న టూరిస్టులు ఆందోళనకు గురై ఏం జరుగతుుందో తెలియక తమ గదుల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం లేదని తెలుసుకొని మళ్లీ తిరిగివచ్చినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో ప్రజలు, టూరిస్టులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.