Here is Reason Why India and Pakistan not participate in Asia Cup: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆసియా కప్ 2023 బుధవారం నుంచి ఆరంభం కానుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. మాజీ విజేతలు భారత్, పాక్, శ్రీలంకలు ఆసియా కప్‌లో మేటి జట్లు అయినా.. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లనూ ఏమాత్రం తీసిపారేయలేం. దాంతో టోర్నీ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
ఆసియా కప్‌కు ఇది 16వ ఎడిషన్. గత 15 ఆసియా కప్‌లలో 13 వన్డే ఫార్మాట్లోనే జరగ్గా.. రెండుసార్లు మాత్రమే టీ20 ఫార్మాట్లో జరిగాయి. ఆసియా కప్‌లో ఎక్కువసార్లు టైటిల్స్ గెలిచింది భారత్. భారత్ ఏడు సార్లు (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) విజేతగా నిలిచింది. ఈ టోర్నీ 1984లో ఆరంభం కాగా.. భారత్ ఓ ఎడిషన్ పాల్గొనలేదు. మరోవైపు పాకిస్తాన్ కూడా ఓ ఎడిషన్ ఆడలేదు. అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1984లో మూడు దేశాల మధ్య జరిగిన ఆసియా కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. అభిమానుల నుంచి మంచి స్పందన రావడంతో 1986లో మరోసారి నిర్వహించారు. అయితే క్రికెట్ సంబంధిత వ్యవహారాలతో పాటు సివిల్ వార్ కారణంగా భారత్ లేకుండానే రెండో ఎడిషన్ జరిగింది. మూడో దేశంగా భారత్ స్థానంలో బంగ్లాదేశ్ ఆడింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం, శ్రీలంక ప్రభుత్వ దళాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చడం కోసం భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో క్రికెటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆసియా కప్ కోసం శ్రీలంకకు భారత జట్టును భారత ప్రభుత్వం పంపించలేదు.
1988 ఆసియా కప్‌లో భారత్ ఆడగా.. బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా నాలుగో జట్టుగా బరిలోకి దిగింది. అయితే 1990లో పాకిస్థాన్ పాల్గొనలేదు. భారత్‌తో రాజకీయపరమైన విభేదాలు తలెత్తడంతో పాక్ ఆడలేదు. సియాచిన్ విషయంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. ఆసియా కప్ 1990లో పాక్ బరిలోకి దొగలేదు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆడిన ఈ టోర్నీ టీమిండియా విజేతగా నిలిచింది. ఇప్పటివరకు అన్ని ఆసియా కప్‌లలో పాల్గొన్న ఏకైక జట్టు శ్రీలంకనే. ఇక ఆసియా కప్ టోర్నీ మధ్యలో ఐదు జట్లతో జరిగినా.. ఇప్పుడు 6 టీమ్‌లతో జరుగుతోంది.