Bangladesh Opener Litton Das out from Asia Cup 2023: ఆసియా కప్ 2023 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా స్టార్ ఓపెనర్ లిట్టన్ దాస్ అనారోగ్యం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. గత కొన్ని రోజుగా దాస్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. ఫీవర్ ఇప్పటికీ తగ్గకపోవడంతో లిట్టన్ దాస్ ఆసియా కప్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అనముల్ హక్ బిజోయ్‌తో భర్తీ చేశారు. హక్ నేడు బంగ్లా జట్టుతో కలవనున్నాడు.
బంగ్లాదేశ్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ మిన్హాజుల్ అబెదిన్ మాట్లాడుతూ… ‘దురదృష్టవశాత్తూ లిట్టన్ దాస్ ఆసియా కప్ 2023కు దూరమయ్యాడు. దాస్ స్ధానంలో అనాముల్ హక్‌ను ఎంపిక చేశాం. అతడు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. హక్ ఎప్పుడూ మా దృష్టిలో ఉంటాడు. దాస్ లేకపోవడంతో మాకు వికెట్ కీపింగ్ చేయగల టాప్ ఆర్డర్ బ్యాటర్ అవసరమైంది. అందుకే హక్‌ను జట్టులోకి తీసుకున్నాం. నేడు అతడు బంగ్లా జట్టుతో కలవనున్నాడు’ అని తెలిపాడు. హక్ ఇప్పటివరకు 44 వన్డేలు ఆడి 1,254 పరుగులు చేశాడు. ఇక ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది.
బంగ్లాదేశ్ జట్టు:
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్, షక్ మహ్మద్, తాంజిద్ హసన్ తమీమ్, తంజిమ్ హసన్ సాకిబ్, అనముల్ హక్ బిజోయ్.