Leading News Portal in Telugu

Gabon: గాబన్‌‌ని స్వాధీనం చేసుకున్న ఆ దేశ సైన్యం.. సంక్షోభంలో ఆఫ్రికా దేశం..


Gabon: ఆఫ్రికా దేశాల్లో వరసగా సైనిక తిరుగుబాటులు జరుగుతున్నాయి. ఇప్పటికే నైగర్ దేశంలో సైనిక తిరుగుబాటు ప్రపంచాన్ని మరోసారి యుద్ధం వైపు నడిపించే విధంగా ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని ఫ్రాన్స్ తో పాటు అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు భావిస్తుంటే మరోవైపు రష్యా ఉంది.

నైగర్ సమస్య ముగియకముందే మరో ఆఫ్రికా దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. గాబన్ దేశాన్ని ఆ దేశ ఆర్మీ స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశానికి చెందిన అన్ని అధికార సంస్థల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పాలనకు ముగింపు పలుకతున్నామని గాబనీస్ ఆర్మీ తెలిపింది.

ఒక డజన్ మంది గాబనీస్ సైనికులు బుధవారం ఆ దేశ టెలివిజన్ లో కనిపించి ప్రస్తుత పాలనకు ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా గెలిచిన ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం రాజధాని లిబ్రేవిల్లేలో ఉద్రిక్తతల నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కాల్పుల మోత వినిపించినట్లు సమాచారం.

ప్రస్తుత పాలనను అంతం చేయడం ద్వారా శాంతిని కాపాడాలని మేము నిర్ణయించుకున్నామని సైన్యానికి చెందిన ఓ అధికారి గాబన్ 24 ఛానెల్ లో చెప్పారు. ఆగస్టు 26, 2023 సాధారణ ఎన్నికలు రద్దు చేయబడ్డట్లు అతను ప్రకటించాడు. గాబన్ దేశ ప్రభుత్వం, సెనెట్, జాతీయ అసెంబ్లీ, రాజ్యంగా న్యాయస్థానం రద్దు చేయబడుతున్నట్లు తెలిపాడు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దేశ సరిహద్దుల్ని మూసేస్తున్నట్లు ప్రకటించాడు.

14 ఏళ్లుగా అధ్యక్షుడు బొంగో అధికారంలో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి 64.27 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చాడు. అతను గెలిచినట్లు జాతీయ ఎన్నికల అథారిటీ ప్రకటించిన వెంటనే సైన్యం దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బొంగో ప్రత్యర్థిగా ఉన్న ఆల్బర్ట్ ఓండో ఒస్సా కేవలం 30.77 శాతం ఓట్లను సాధించాడు. ఇతను బొంగో మోసంతో గెలిచాడని ఆరోపిస్తున్నాడు. బొంగో ప్రభుత్వం తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్‌డౌన్ చేశారు.