Leading News Portal in Telugu

Google Flights: గూగుల్ కొత్త ఫీచర్.. తక్కువ ధరకే విమాన టికెట్లు


Google New Feature To Book Flight Tickets: విమానంలో ప్రయాణించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనే  చెప్పాలి. ఒక్క టికెట్ కొనాలంటేనే సామాన్యుడి జేబుకు చిల్లుపడిపోతుంది. అయితే కొన్ని రోజుల ముందు బుక్ చేసుకుంటే విమాన టికెట్లు తక్కువ ధరకే పొందవచ్చు. కొన్నిసార్లు అయితే విమాన టికెట్లు బస్సు ధరలకే అందుబాటులో ఉంటాయి. అయితే దీని కోసం విమాన టికెట్లు రేట్లు ఎప్పుడు తక్కవగా ఉంటాయి అనే విషయాలు మనకు తెలిసి ఉండాలి. కానీ ఆ వివరాలు తెలుసుకోవడం ఎక్కువ విశ్లేషణతో కూడిన పని. అందుకే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపే గూగుల్ దీని కోసం కూడా ఒక కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. అదే  ‘గూగుల్ ఫ్లైట్స్’. తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ ను  బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ సాయపడుతుందని గూగుల్ సంస్థ పేర్కొంది.

విమాన టికెట్లు ఎప్పుడూ ఒకేలా వుండవు కాబట్టి మీరు వెళ్లాల్సిన ప్రదేశానికి ఏ సమయంలో టికెట్ రేట్లు తక్కువగా ఉంటాయనే వివరాలతో పాటు బుకింగ్ విషయంలో సలహాలు, సూచనలను కూడా అందిస్తుంది ఈ గూగుల్ ప్లైట్ ఫీచర్. మీరు ప్రయాణం చేయాలని అనుకుంటున్న రూట్ లో ఏయే సమయాల్లో ధరలు తక్కువగా ఉంటాయనేది గూగుల్ ఫ్లైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఇతరత్రా ప్రత్యేక సందర్భాలలో టికెట్ ధరలు తగ్గినపుడు కూడా మిమ్మల్ని అలర్ట్ చేస్తూ గూగుల్ ఫీచర్ మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. వివిధ రూట్లలో గతంలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయనేది గూగుల్ ఫ్లైట్స్ విశ్లేషించి అందిస్తుంది.

ఆ సమాచారంతో టికెట్ బుకింగ్ ఎప్పుడు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందో గూగుల్ ప్లైట్ తెలియజేస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో నిర్దేశించిన రూట్ లో ప్రయాణించేటపుడు చివరి నిమిషంలో (టేకాఫ్ కు ముందు) టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది గూగుల్ ప్లైట్. అయితే కొన్ని నెలల్లో క్రిస్మస్ పండుగ రానుంది. ఈ సమయంలో టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయాల్లో 71 రోజుల ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే తక్కువ ధరకే టికెట్ పొందే అవకాశం ఉంటుందని గూగుల్ ఫ్లైట్స్ సూచిస్తోంది. ఇలా వివిధ సందర్భాలలో ఫ్లైట్ టికెట్ ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల గురించి ప్రయాణికులను ఎప్పటికప్పుడు గూగుల్ ప్లైట్ అలర్ట్  చేస్తుందని గూగుల్ కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ చాలా మందికి ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.