Leading News Portal in Telugu

Fire Accident : శ్రీకాకుళంలో షాపింగ్ మాల్‌లో మంటలు


శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని స్నేహ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగడంతో షాపులోని వస్తువులు మంటల్లో దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దింగింది. నాలుగు ఫైర్‌ ఇంజిన్‌లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ప్రాథమిక విచారణ ప్రకారం, అగ్నిప్రమాదం వల్ల ఆస్తి నష్టం వాటిల్లిందని, రూ. 6 కోట్లు కాగా, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తేల్చారు. ఖచ్చితమైన కారణాన్ని దర్యాప్తు తరువాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని అధికారులు షాపింగ్‌ మాల్స్‌ యజమానులకు సూచించారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ సాధారణ నిర్వహణ చాలా కీలకమని వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నిన్న కర్ణాటక లోని హవేరీ జిల్లాలోని అలదకట్టి గ్రామంలో బాణాసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి , పోలీస్‌లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.