Leading News Portal in Telugu

G20 Summit: లగ్జరీ కార్‌కి ఒక్క రోజు రెంట్ రూ. 1 లక్ష.. అంతా జీ20 మహిమ


G20 Summit: భారత్ మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అగ్రదేశాల అధినేతలు, అధికారులతో ఢిల్లీ పూర్తిగా సందడిగా మారనుంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, కెనడా ప్రధాని ట్రూడో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, వంటి అగ్రనేతలు ఈ సమావేశాలకు హాజరుకాబోతున్నారు.

ఇదిలా ఉంటే జీ20 సమావేశాల పుణ్యమా అని లగ్జరీ కార్ల అద్దెలు అమాంతం ఆకాశాన్ని అంటుతున్నాయి. సమ్మిట్‌కు లగ్జరీ కార్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనికి తగ్గట్లుగానే ఒక రోజు అద్దె రూ. 1 లక్షకు చేరింది. ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని దాదాపు 30 లగ్జరీ హోటళ్లు బుక్ అయ్యాయి.

ఈ సమ్మిట్ కోసం దాదాపుగా 29 మంది దేశాధినేతలు భారత్ వస్తున్నారు. జీ 20 దేశాల అధినేతలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అగ్రనేతలు ఉన్నారు. ఇలా అగ్రనేతలకు, ఉన్నతాధికారులకు వీరిని సమ్మిట్ జరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు లగ్జరీ కార్లకు డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఉన్న కార్లలో మెర్సిడెస్ మేబ్యాక్ ఉంది, దీని కోసం అడిగే అద్దె ధర రోజుకు రూ. 1 లక్ష వరకు ఉంటుంది.మ మెర్సిడెస్ తో పాటు బీఎండబ్ల్యూ, ఆడి వంటి కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు చెబుతున్నాయి.

అగ్రదేశాల అధినేతలు వస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్ఎస్జీ, పారాకమాండోలు రంగంలో దిగారు. వీరితో పాటు ఆయా దేశాల అధినేతల సెక్యూరిటీ సిబ్బంది కూడా ఢిల్లీకి చేరుకుంటోంది. భద్రత కోసం అత్యధునిక ఏఐ కెమెరాలను, ఇతర టెక్నాలజీని వాడుతున్నారు. దీంతో పాటు అమెరికా సీఐఏ, యూకే ఎంఐ-6, చైనా నుంచి ఎంఎస్ఎస్ వంటి అంతర్జాతీయ గూఢాచార సంస్థలు బృందాలు తమ నాయకులు భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేయడానికి ఢిల్లీ చేరుకున్నారు.