Amazon: వర్క్ ఫ్రం హోం సంస్కృతికి స్వస్తి పలకాలని పలు టెక్ కంపెనీలు ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మహమ్మారి ముగిసినా కొంతమంది ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ఇష్టపడటం లేదు. అయితే అలాంటి వారికి కంపెనీ యజమాన్యాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మేనేజ్మెంట్ నిర్ణయాలను పాటించకపోతే ఉద్యోగులు వెళ్లిపోవచ్చని నిర్మొహమాటంగా చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ కంపెనీ ఇప్పటికే తమ ఉద్యోగులకు ఆఫీసులకు రావాలని చెప్పింది. వర్క్ ఫ్రం హోంకి స్వస్తి చెప్పాలని తెలిపింది. ఈ నిర్ణయమే ఆ కంపెనీ ఉద్యోగుల్లో నిరసనలకు కారణం అవుతోంది. ఉద్యోగులు ఆఫీసుకు రావడానికి ససేమిరా అంటున్నారు. అలాంటి వారికి అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని వర్క్ పాలసీని అమెజాన్ నిర్ణయించింది. ఎవరైనా ఉద్యోగులు దీనికి ఒప్పుకోకుంటే ఆమెజాన్ సంస్థలో ఉంటారో లేదో నిర్ణయించుకోవాలనీ సీఈఓ హెచ్చరించారు.
సంస్థ నిర్ణయం పట్ల కొంత మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం విధానానికి అలవాటు పడిన వారు ఇప్పుడు ఆఫీసులకు రమ్మనడంతో ఉద్యోగాన్ని వదిలేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయినా కూడా సీఈఓ ఆండీ జాస్సీ తన నిర్ణయంపై ధృడంగా ఉన్నారు. కొంతమంది ఉద్యోగులు మాత్రం ఆఫీసుకు వచ్చి సహోద్యోగులతో వ్యక్తిగతంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన సీఈఓ కంపెనీ పాలసీని అంగీకరించాలని తెలిపారు. ఆఫీస్‌కు రావడానికి ఇష్టపడని కార్మికులు తమంతట తానుగా వెళ్లిపోవచ్చని సూచించారు.