Leading News Portal in Telugu

Asia Cup 2023: ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే పాకిస్తాన్ పటిష్ఠంగా మారింది.. జాగ్రత్తగా ఉండాల్సిందే!


R Ashwin Says Pakistan is favourites in Asia Cup 2023: మరికొన్ని గంటల్లో ఆసియా కప్‌ 2023 ప్రారంభం కానుంది. ముల్తాన్‌ వేదికగా టోర్నీ ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. పాకిస్థాన్‌, నేపాల్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ తెరలేవనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్‌ మొదలు కానుంది. ఈ టోర్నీలో భారత్ సహా పాకిస్తాన్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాక్ గత 5-6 ఏళ్లుగా పటిష్ఠంగా మారడానికి ఇద్దరు ప్లేయర్స్ కారణమని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు.

ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘పాకిస్థాన్‌ జట్టును చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 5-6 ఏళ్ల క్రితం పాక్ మెగా టోర్నీల్లో ఇబ్బందిపడేది. ఆసియా కప్, ప్రపంచకప్‌ వంటి టోర్నీల్లో పేలవ ప్రదర్శన చేసేది. ఐసీసీ ట్రోఫీలను గెలిచిన అనుభవం ఉన్నప్పటికీ.. కొంతకాలం కిందట వరకు పాకిస్థాన్‌ బాగా ఆడేది కాదు. అయితే గత ఆరేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారింది. అందుకు కారణం బాబర్ ఆజామ్‌, మహమ్మద్ రిజ్వాన్. ఈ ఇద్దరి భాగస్వామ్యంలో పాక్‌ అద్భుతంగా పుంజుకుంది. అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం వారికి కలిసొచ్చింది’ అని అన్నాడు.

‘పాకిస్తాన్ జట్టును ఎంపిక చేసుకొనే తీరు బాగుంది. అద్భుత ఫాస్ట్‌ బౌలర్లను తయారు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మంచి బౌలర్లు ఉనారు. అలానే 90ల్లో ఉన్న మాదిరిగా స్ట్రాంగ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. పీఎస్‌ఎల్‌తో పాటు బీబీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఆడుతున్నారు. టెస్టు క్రికెట్‌ను కూడా ఎక్కువగానే ఆడటంతో ప్రయోజనం కలుగుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో కఠిన పిచ్‌లపై మ్యాచ్‌లను ఆడిన అనుభవం పాక్‌ ఆటగాళ్లకు ఉంది. ఎమిరేట్‌ లీగ్‌, యూఎస్‌ఏ, కెనడా, సీపీఎల్‌ లాంటి లీగ్‌లలో ఆడడం వల్ల ఆటగాళ్లలోని టాలెంట్‌ బయటికొస్తుంది’ అని యాష్ చెప్పాడు.

‘పాకిస్తాన్ జట్టులో బాబర్ ఆజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ఆసియా కప్‌ 2023లో ఎక్కువగా శ్రీలంక వేదికగానే మ్యాచ్‌లు జరగనున్నాయి. లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు పాక్‌ నుంచే ఉన్నారు. కాబట్టి వారికి ఇది కూడా సొంత మైదానాల కిందే లెక్క. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో అన్ని జట్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ఆర్ అశ్విన్‌ సూచించాడు.