ఏపీలో బీజేపీది డబుల్ గేమా? వైసీపీ కోసమే వ్యూహాలా? | bjp double game in ap| favour| ycp| tdp| janasena| alliance| triangular
posted on Aug 30, 2023 10:50AM
దక్షిణాదిలో, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించేందుకు బీజేపీ పట్టువీడని విక్రమార్కునిలా సాగిస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా కొనసాగుతున్నాయి. ఆ పార్టీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రూపొందిస్తోంది. కొత్త ఎత్తులు వేస్తున్నది. అయితే తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అడుగులు ముందుకు పడటం అటుంచి వెనక్కు పడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ ఏమి చేసినా, ఎన్ని వ్యూహాలు పన్నినా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోతున్నది. ఏపీలో బీజేపీ పయనం ఓటమి నుంచి ఓటమికి అన్నట్లుగా తయారైంది. పేరుకే ఏపీలో ఆ పార్టీకి జనసేన రూపంలో మిత్రపక్షం ఉంది. అయితే ఆ రెండు పార్టీల మధ్యా మైత్రి రాజుగారి దివ్య వస్త్రాలుగానే చెప్పుకోవాలి. ఈ నాలుగేళ్లలో జరిగిన ఉప ఎన్నికలలో అయితేనేమి, స్థానిక ఎన్నికలలో అయితేనేమీ ఆ రెండు పార్టీలూ కలిసి నడిచింది లేదు. పైపెచ్చు ఇటీవలి కాలం వరకూ ఏపీలో బీజేపీ చేపట్టిన ప్రతి కార్యక్రమం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ఏదో ఒక మేర ప్రయోజనం చేకూర్చేదిగానే ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషణలు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలతో పాటుగా దేశ ప్రయోజనాలను సైతం దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తున్న వైసీపీ అరాచక, అసమర్ధ పాలన కొనసాగింపునకు బీజేపీ తెర వెనక కుట్రలు పన్నుతోందన్న అనుమానాలు రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్రపగ్గాలు చేపట్టడానికి ముందు వరకూ రాష్ట్ర బీజేపీ వైసీపీకి బీ టీమ్ లా పని చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీలోని సీనియర్లే పదే పదే అధిష్ఠానం వద్దకు తీసుకువెళ్లారు. ఫిర్యాదులు చేశారు. అయినా దీర్ఘ కాలం పాటు కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ హై కమాండ్ ఎట్లకేలకు సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను పురంధేశ్వరికి అప్పగించింది. ఇది జరిగిన తరువాత కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీలోని వైసీపీ సర్కార్ తో రహస్య మైత్రిని కొనసాగిస్తూనే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొత్తుల విషయంలో ప్రతిష్ఠంభణను కొనసాగిస్తూ.. పరోక్షంగా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక కోసం ప్రయత్నిస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు దేశం పార్టీని ఒంటరిని చేసేందుకు జనసేన పార్టీతో మైత్రిని కొనసాగిస్తున్నదని అంటున్నారు. అలా మైత్రి కొనసాగిస్తూ.. తెలుగుదేశం పార్టీతో జనసేన దూరం పెరిగే విధంగా పావులు కదుపుతున్నదని అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి 23 సీట్లే వచ్చినా, 40 శాతం ఓట్లు తెచ్చుకుని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగిస్తోంది. జగన్ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. జగన్ రెడ్డి సొంతంగా చేయించుకున్న సర్వేలు, ఐప్యాక్ నిర్వహించిన సర్వేలే కాకుండా జాతీయ స్థాయి సంస్థలు మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ నిర్వహించిన సర్వేలలో కూడా పొత్తులతో సంబంధం లేకుండా ఏపీలో అత్యధిక పార్లమెంటు స్థానాలను తెలుగుదేశం గెలుచుకుంటుందని చెబుతున్నాయి.
ఇక ప్రభుత్వ కార్యక్రమాలకు జనం ముఖం చాటేస్తుండటం, అదే సమయంలో చంద్రబాబు సభలకు, నారా లోకేష్ పాదయాత్రకు జనం పోటెత్తుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం ఏమిటన్నది అందరికీ ప్రస్ఫుటంగా అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నది. గత నాలుగేళ్లుగా జగన్ రెడ్డి ఆర్థిక అవకతవకలకు సహకరించిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు అదే జగన్ రెడ్డి ఆర్థిక అరాచకత్వంపై, అడ్డగోలు అప్పులపై గణాంకాలతో విమర్శలు గుప్పిస్తున్నది. జగన్ రెడ్డి నిర్వాకానికి ఇంత కాలం సహకారం అందించి వంత పాడింది తామేనన్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నది. బీజేపీని దూరం పెట్టి అయినా సరే జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు సాగుదామని భావిస్తున్న విషయాన్ని పలు సందర్భాలలో జనసేనాని పవన్ కల్యాన్ పరోక్షంగానైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నే బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చడం, పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించడం చేసింది.
అయితే బీజేపీ మూవ్ పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వంక జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో అడుగులు వేస్తుంటే.. పవన్ ను దగ్గరకు తీసి ఆ పార్టీని తెలుగుదేశంకు దూరం చేయాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా చేయడం ద్వారా రాష్ట్రంలో ముక్కోణపు పోరు అనివార్యమయ్యే పరిస్థితి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్నదని చెబుతున్నారు.