నేడు(ఆగస్ట్ 30) ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టీమ్ 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 రన్స్ చేసింది. బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు ), ఇఫ్తికార్ అహ్మద్ ( 71 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్సర్లతో 109 నాటౌట్ ) శతకాలతో విరుచుకుపడగా.. మహ్మద్ రిజ్వాన్ (44) పర్వాలేదనిపించాడు.
ఇక, ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్, అఘా సల్మాన్ విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామీ 2 వికెట్లు తీసుకోగా.. కరణ్ , సందీప్ లామిచ్చేన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇమామ్ ఉల్ హాక్, రిజ్వాన్ రనౌట్లయ్యారు. అయితే, 343 పరుగుల భారీ లక్ష్యాఛేదనకు దిగిన నేపాల్ జట్టు.. 23.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. షాదాబ్ ఖాన్ 27 పరుగులు ఇచ్చి కీలకమైన 4 వికెట్లు తీసుకున్నాడు. నేపాల్ పతనాన్ని షాదాబ్ ఖాన్ శాశించగా.. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ చెరో 2 వికెట్లు.. నసీం షా, నవాజ్ తలో వికెట్ తీసుకున్నారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరిఫ్ షేక్ (26), సోంపాల్ కామీ (28), గుల్సన్ షా (13) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
అయితే, నేపాల్‌తో జరుగుతున్న టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లో పాక్ సారథి బాబర్ ఆజమ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 109 బంతులు ఆడిన బాబర్ 10 బౌండరీల సాయంతో కెరీర్‌లో 19వ సెంచరీని నమోదు చేశాడు. దాంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును సమం చేశాడు. సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే శతకాలు బాధిన పాకిస్థాన్ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.