Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి సొంత గుర్తింపు లేదు.. ఎన్టీఆర్ పేరు, పార్టీ వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు బఫూన్ కి ఎక్కువ.. జోకర్ కి తక్కువ అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదు అని చంద్రబాబు జోక్ చేస్తున్నారన్న ఆయన.. పవన్ కల్యాణ్, బీజేపీ పొత్తు ఊహాగానాలు లేకుంటే లోకేష్ పాదయాత్రకు క్యాడర్ రారన్నారు. చంద్రబాబుకి దేని మీదా నమ్మకం లేదు.. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు జేపీ నడ్డాతో ఒంగి ఒంగి నంగిగా మాట్లాడారు అని విమర్శించారు. చంద్రబాబు తిట్టి, గంటలో కాళ్లు పట్టుకోగలడని దుయ్యబట్టారు.
మోడీ కుటుంబాన్ని కూడా చంద్రబాబు గతంలో తిట్టారని గుర్తుచేశారు సజ్జల.. ప్రత్యేక హోదాకి ప్యాకేజ్ సమానం అని చంద్రబాబు అన్నారు. ఇక, చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో పోటీ పెట్టగలడా? అంటూ సవాల్ చేశారు. పొత్తులు లేని హిస్టరీ చంద్రబాబుకి లేదన్న ఆయన.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఆలోచన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కి లేదని విమర్శించారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయం కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లింది.. ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికి ఘోషిస్తుంది.. చంద్రబాబు ఏజెంట్ గా పురంధరేశ్వరి పని చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ లక్షల మంది ముందు పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీ పార్వతి ని ఎన్టీఆర్ ధర్మపత్నీగా ప్రజలు ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా ఆమెను పిలవకుండా ఎన్టీఆర్ ఆత్మ క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తంత చేశారు సజ్జల.
బీజేపీ, చంద్రబాబుని కలపడానికే పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిగా పెట్టారని ఆరోపించారు సజ్జల.. బీజేపీ, టీడీపీ కలపాలని అనుకుంటే ఎవరు అపుతారు.? అని ప్రశ్నించారు.. చంద్రబాబు భావజాలం అంటే రాష్ట్రాన్ని నాశనం చేయడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.