Leading News Portal in Telugu

Elephant : చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం.. దంపతులు మృతి


చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు భీభత్సం సృష్టించింది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం 190 – రామాపురం గ్రామంలో బుధవారం ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందారు. ఒంటరిగా ఉన్న ఏనుగు గ్రామంలోకి వెళ్లి పొలంలో ఉన్న దంపతులు వెంకటేష్ (50), సెల్వి (45)పై దాడి చేసి చంపేసింది. ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించిన ఏనుగు రైతు కార్తీక్‌పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో… రైతు కార్తీక్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో గుడిపాల ఆస్పత్రికి తరలించారు.

గ్రామాల్లోకి వచ్చిన అడవి ఏనుగు పెంపుడు జంతువులపై దాడి చేయడంతో అనేక జంతువులు మృత్యువాత పడ్డాయి. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పంటలను విధ్వంసం చేస్తున్న ఏనుగును అడవుల్లోకి తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు ఆర్డీఓ రేణుక, తహశీల్దార్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి బాధిత ప్రాంతాలను సందర్శించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యభర్తలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పంలో సమీపంలో కూడా అడవి ఏనుగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.