Leading News Portal in Telugu

Fire Accident: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం! కోట్లలో ఆస్తి నష్టం


Huge Fire Accident in Srisailam Temple: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్‌లో అర్ధరాత్రి దాటాక ఎల్‌ బ్లాక్‌ సముదాయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు.

మల్లన్న ఆలయ సమీపంలోని లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలలో బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఎల్ బ్లాక్‌లో దాదాపుగా 15 దుకాణాలు మంటలతో దగ్దమయ్యాయి. ఓ దుకాణంలో చెలరేగిన మంటలు.. పక్కన ఉన్న దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. దుకాణదారులు విద్యుత్ శాఖకు ఫోన్ చేసి.. పవర్ కట్ చేయించారు. అయితే అప్పటికే సుమారు 15 బొమ్మలు, గాజులు, దేవుడి ఫోటోల దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సంఘటన స్థలానికి చేరుకున్న దేవస్థానం వాటర్ ట్యాంకర్, ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేశాయి. అప్పటికే దుకాణాలు అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి.

శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్ల నష్టం వాటిల్లినట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుకాణాలపైనే విద్యుత్ స్తంభాలు ఉండడంతో.. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.