Leading News Portal in Telugu

ఏపీలో పొత్తులు.. తెలంగాణలో ఒంటరి పోరు.. తెలుగుదేశం వ్యూహం ఇదేనా? | alliances in ap| single|fight |telangana| tdp| strtegy| chandrababu| bjp| janasena


posted on Aug 31, 2023 6:37AM

గెలుపోటములతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు అంటే రాజకీయాలలో అపర చాణుక్యుడనే పేరున్న సంగతి తెలిసిందే. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోవడంలో ఆయనకో మార్క్ ఉంది. ఇప్పటి వరకూ జరిగిన ప్రతి ఎన్నికలలో ఆయన స్ట్రాటజీలను చూసిన వారు ఆయన రాజకీయ చతురతను కొనియాడకుండా ఉండలేరు. కాగా రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం  పొత్తులతో కలిసి వెళ్తుందా? ఒంటరిగా పోటీకి దిగుతుందా అనే సందిగ్దత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జనసేన, బీజేపీలను కలుపుకునే టీడీపీ ఎన్నికలకు వెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాలలో బలంగా ప్రచారం జరుగుతున్నది. అధికార  వైసీపీ నేతలైతే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ఎప్పుడో కుదిరిపోయాయని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, నడ్డాలతో  చంద్రబాబు భేటీ కావడంతో పొత్తులు  దాదాపుగా ఖరారయ్యాయని జనం  కూడా ఫిక్సయిపోయారు. అయితే  ఇప్పటి వరకూ ఈ పొత్తులపై ఎక్కడా అధికారిక ప్రకటనలు లేవు.

మరోవైపు తెలుగుదేశం తెలంగాణలో ఎలా ముందుకు వెళ్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ మధ్య ఖమ్మం సభతో తెలంగాణలో కూడా టీడీపీ ఊపు కనిపించినా ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో తెలంగాణ తమ్ముళ్లు నిరాశపడిపోయారు. అయితే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలుగుదేశం తెలంగాణపై  ఫోకస్ పెంచింది. ఇప్పటికే తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన చంద్రబాబు.. తాజాగా ఇక్కడ ఎలాంటి పొత్తులకు అవకాశం లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో ఇటీవల మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, అన్ని స్థానాలలో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉంటారని వెల్లడించారు. ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం.. ఎన్నికల మూడ్ వచ్చేయడంతో ఇక తెలంగాణలో పొత్తులు లేవని చంద్రబాబు డిసైడ్ చేసేశారు.

 అలాగే ఏపీలో పొత్తులపై కొంత సానుకూల ధోరణితో మాట్లాడారు. బీజేపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం విభేదించామన్న  విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కుగా పేర్కొన్న చంద్రబాబు.. ఆ హక్కు సాధన కోసమే అప్పటి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేశామని.. బీజేపీతో తమకు ఎప్పుడూ శత్రుత్వం లేదని తెలిపారు. అంతే కాదు, ఎన్నికల్లో పొత్తులపై కాలమే నిర్ణయిస్తుందన్నారు. పొత్తులు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని.. ఇప్పటివరకు అయితే పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే పొత్తులపై క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

అయితే, తెలంగాణలో సింగిల్ గా.. ఏపీలో ఉమ్మడిగా వెళ్లేలా టీడీపీ వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తున్నది.   గత ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ దాన్ని ఆయుధంగా వాడుకున్నారు. టీడీపీ భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను కాల్చేసి మళ్ళీ అధికారాన్ని దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీని పరాయి పార్టీగా.. చంద్రబాబును ఆంధ్రా పాలకునిగా, ఆంధ్రా పాలకులతో చేతులు కలిపిన పార్టీగా ప్రజలలో కాంగ్రెస్ ను నిలబె్టడంలో అప్పుడు కేసీఆర్ వంద శాతం సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈసారి టీడీపీ ఒంటరిగానే తెలంగాణలో బరిలో దిగుతున్నది.

ఇక ఏపీ విషయానికి వస్తే ఇక్కడ గత ఎన్నికలు తెలంగాణ ఎన్నికలకు పూర్తిగా విరుద్ధం. తెలంగాణలో టీడీపీ పొత్తుతో వెళ్లడంతో నష్టం జరిగితే.. ఏపీలో సింగిల్ గా వెళ్లడంతో నష్టం జరిగింది. అంతకు ముందు 2014లో టీడీపీతో కలిసి ఉన్న జనసేన, బీజేపీని కాదని టీడీపీ ఒంటరిగా పోటీ చేయడంతో ఓట్లు చీలి వైసీపీకి మేలు జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడంతోనే వైసీపీకి ఊహించని స్థాయిలో సీట్లు దక్కాయి. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు కూడా ఏపీలో ప్రతికూల ప్రభావం చూపించింది. అందుకే ఈసారి రివర్స్ లో తెలంగాణలో ఒంటరిగా పోటీకి దిగుతున్న తెలుగుదేశం ఏపీలో మాత్రం కలిసి వచ్చే మిత్ర పక్షాలను కలుపుకొని పోవాలని భావిస్తోంది. మరి ఎన్నికల సమయానికి ఈ పొత్తుల వ్యవహారం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.