Babar Azam Beat Virat KohliRecord in PAK vs NEP Asia Cup 2023 Match: పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభ మ్యాచ్ బుధవారం పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో నేపాల్‌ను పాక్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సెంచరీతో చెలరేగాడు. 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. బాబర్‌కు ఇది వన్డే కెరీర్లో 19వ వన్డే సెంచరీ. సెంచరీతో చెలరేగిన బాబర్.. పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లీ అత్యధిక స్కోర్ 136. నేపాల్ మ్యాచ్‌లో 151 పరుగులు చేసిన బాబర్.. రికార్డుల రారాజు కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజమ్ రికార్డు నెలకొల్పాడు. బాబర్ ఈ ఫీట్‌ను 102 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా 104 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఆమ్లా రికార్డును ఆజమ్ బ్రేక్ చేశాడు.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత్ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (5,238), ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ (5,346)ను బాబర్ ఆజమ్ అధిగమించాడు. ఇప్పటివరకు 102 ఇన్నింగ్స్‌లలో బాబర్ వన్డేల్లో 5,353 పరుగులు చేశాడు.