బీజేపీకి తెలుగుదేశం ఆఫర్ పాతిక అసెంబ్లీ స్థానాలు.. నిజమేనా? | tdp offers 25 assembly seats to bjp| true| strategy| alliance| janasena| ap| politics| 2024
posted on Aug 31, 2023 2:02PM
ఏపీలో రానున్న ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జనసేన, బీజేపీలకు ఎన్ని అసెంబ్లీ సీట్లు కేటాయిస్తుంది? ఎన్ని లోక్ సభ స్థానాలు కేటాయిస్తుంది? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన, బీజేపీలు టీడీపీతో పొత్తు కోసం ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తున్నాయి? ఇలా చాలా రోజులుగా ఇవే ప్రశ్నలు రాజకీయ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడిన ప్రతిసారి, చంద్రబాబు బీజేపీ నేతలతో కలిసినా, పవన్ కళ్యాణ్ తో కలిసినా పొత్తు ఖరారైందని.. జనసేన-బీజేపీలకు కేటాయించిన సీట్లు ఇవేనంటూ కథనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు.
ఢిల్లీ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే బీజేపీతో తమకు వ్యక్తిగత శత్రుత్వం లేదని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో విభేదించామని చెప్పారు. ఇక సమయం వచ్చినపుడు పొత్తుల గురించి చెప్తానని.. కాలమే పొత్తులను నిర్ణయిస్తుందని చంద్రబాబు చెప్పారు. కాగా, చంద్రబాబు అలా నడ్డాతో భేటీ అయ్యారో లేదో ఇలా జాతీయ మీడియా నుండి లోకల్ మీడియా వరకూ మళ్ళీ యథావిథిగా పొత్తులపై కథనాలు వండి వార్చాయి. బీజేపీ అనుకూల మీడియా ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ ప్రసారాలు చేసింది. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం చర్చలలో ఏకంగా బీజేపీకి 25 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు ఆఫర్ చేశారని కథనాలు వదిలారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే ఈ వార్తా కథనాలన్నీ బీజేపీ అనుకూల మీడియా వండి వార్చినవేనన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 25 ఎమ్మెల్యే స్థానాలు, 5 ఎంపీ స్థానాలను టీడీపీ కేటాయిస్తుందనడం వాస్తవానికి దూరంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ కావచ్చు కానీ ఏపీలో ఆ పార్టీకి కనీసమైన స్టేక్ కూడా లేదు. నిండా ఒక శాతం ఓటింగ్ కూడా లేదు. మరోవైపు ఒంటరిగానైనా ఈసారి టీడీపీ అధికారం దక్కించుకుంటుందని ఇప్పటికే పలు సర్వేలు పేర్కొన్నాయి. జనసేన-బీజేపీలతో కలిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్తూనే.. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా వందకు తగ్గకుండా స్థానాలను సొంతం చేసుకుంటుందని పలు సర్వేలు వెల్లడించాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ పేర ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఏపీలో పొత్తులతో సంబంధం లేకుండానే తెలుగుదేశం 15 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగుర వేస్తుందని పేర్కొంది. మరోవైపు బీజేపీ కలిసిరాకపోయినా పొత్తుకు జనసేన సిద్ధంగా ఉంది. బీజేపీని దూరం పెడితే.. పవన్ కళ్యాణ్ పొత్తు ఎటూ ఉంటుంది. అదనంగా వామపక్షాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరి ఇన్ని అడ్వాంటేజీలు ఉండగా చంద్రబాబు బీజేపీకి ఏకంగా 25 అసెంబ్లీ స్థానాలు ఎలా కేటాయిస్తారు? ఎందుకు కేటాయిస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే జనసేన-బీజేపీలకు కలిపి కూడా అన్ని సీటు కేటాయించడం కూడా అనుమానమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా బీజేపీకి తెలుగుదేశం అధినేత పాతిక అసెంబ్లీ స్థానాలు ఆఫర్ చేశారన్న ప్రచారం కేవలం బీజేపీ స్ట్రాటజీగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు.
ప్రతి అంశాన్ని తమకు కావాల్సినట్లు మలచుకునే ప్రయత్నం చేసే బీజేపీ ఏపీలో పొత్తుల వ్యవహారాన్ని కూడా ఇదే విధంగా తమకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నమే ఈ 25 సీట్ల ఆఫర్ కథనాలను పరిగణించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అన్నిటికీ మించి మోడీ హవా బ్రహ్మాండంగా వీచిన 2014 ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం ఆ పార్టీకి కేవలం 9 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్ సభ స్థానాలు కేటాయించింది. మరి తొమ్మిదేళ్ల పాలన తరువాత దేశంలో మోడీ పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏపీలో బలంగా ఉన్న తెలుగుదేశం బీజేపీకి పొత్తులో భాగంగా ఏకంగా పాతిక స్థానాలను ఆఫర్ చేసిందంటే నమ్మడం కష్టమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.