
Babar Azam on Virat Kohli: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సెంచరీ చేయడంతో పాక్ సునాయాస విజయం సాధించింది. ఇక శనివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక సమరంకు బాబర్ సేన సిద్ధం అవుతుంది. అయితే గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లపై బాబర్ స్పందించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి తనకు పాజిటివ్ కామెంట్లు రావడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఆ ఫీలింగ్ చాలా బాగుంది అని బాబర్ చెప్పాడు.
‘ఎవరి దగ్గరి నుంచి అయినా పాజిటివ్ కామెంట్లు వస్తే ఆనందంగా ఉంటుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటివి వస్తే ఎంతో గర్వ కారణంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఏ ఆటగాడికైనా ఎలాంటివి ఆత్మవిశ్వాసం పెంచుతుందనడంలో సందేహం లేదు. 2019 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన సంఘటనను ఇటీవల కోహ్లీ చెప్పాడు. అప్పుడు అతడు కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అతడి నుంచి నేర్చుకోనేందుకు అప్పుడు కోహ్లీని కలిసేందుకు వెళ్లా. కోహ్లీ మాట్లాడిన తీరు నన్ను ఆకట్టుకుంది. చాలా విషయాలు నేర్చుకున్నా. కెరీర్లో అవి చాలా ఉపయోగపడ్డాయి’ అని బాబర్ ఆజామ్ తెలిపాడు. ఇందుకు సంబందించిన వీడియోను క్రీడా ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
Also Read: Video Feature On X: ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్.. ఫోన్ నంబర్ అవసరం లేదు!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘నేను బాబర్ ఆజామ్‌ను తొలిసారి 2019 ప్రపంచకప్ సమయంలో కలిశా. అప్పటి నుంచి ఇప్పటివరకు బాబర్ పట్ల ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదు. అతడికీ నాపై ఇలానే ఉంది. ప్రస్తుతం బాబర్ అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్నాడు. బాగా ఆడుతున్నాడు. నిలకడైన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. అతడి ఆటను చూస్తూ నేనూ ఎంజాయ్ చేస్తా’ అని అన్నాడు.