CM Jagan Review: జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాల పై విస్తృత్రంగా ప్రచారం చేయాలన్నారు. రెవెన్యూ విభాగంలో వస్తున్న విప్లవాత్మకంగా మార్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
చాలా రాష్ట్రాల్లో మండలానికి ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే ఉన్నారని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలో కూడా సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ ఈ సందర్భంగా చెప్పారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతోందన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా సాంకేతికతను తీసుకు వస్తున్నామన్నారు. అలాగే భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాలస్థాయిలో మొబైల్ కోర్టులు కూడా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.