సీన్ రివర్స్.. నాడు పొగడ్తలు నేడు తెగడ్తలు | scene reverse| jagan| sharmila| arrow| roja| vidadala| rajani| ap
posted on Aug 31, 2023 2:40PM
దేనికైనా టైమ్ రావాలంటారు. అలాంటి టైమ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీఅధినేత జగన్‌కు వచ్చింది.. కాదు.. కాదు ఆయన సొంత చెల్లెలు షర్మిల తీసుకువచ్చారన్న ప్రచారం పోలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. జగన్ జైల్లో ఉంటే.. జగనన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి.. జగనన్న గద్దెనెక్కితే రాజన్న రాజ్యం వస్తుందంటూ.. హోరెత్తించేసిన షర్మిల జగనన్న అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర సైతం చేశారు. ఆమె ప్రచారం ఫలితంగా 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ఏపీలో అధికారం చేపట్టింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల ఫలితాలతో జగన్ ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యారో తెలియదు కానీ.. జగనన్న కళ్లలో ఆనందం చూసి.. షర్మిల మాత్రం ఓ రేంజ్లో సంతోషపడ్డారనడంలో సందేహం లేదు.
అయితే అలా అధికార పగ్గాలు చేపట్టిన జగన్‌కి నాటి నుంచి గుడ్ టైమ్ మొదలైతే.. ఆయన సోదరి షర్మిలకు మాత్రం బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని పోలిటికల్ సర్కిల్లో ఓ చర్చ నేటికీ సాగుతోంది. అయితే సోదరుడు జగన్ గద్దెనెక్కిన తర్వాత ఒక సారి మాత్రమే వైయస్ షర్మిల రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టారనీ, ఆ తర్వాత వీరి మధ్య గ్యాప్ రావడంతో.. ఆమె తన తల్లిని తీసుకొని పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్లిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే.
అలా సోదరుడు జగన్‌కి వైయస్ షర్మిల దూరం జరిగితే.. మరోవైపు జగన్‌ని గతంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారు.. అంటే జగన్ కేబినెట్లోని పలువురు మహిళా మంత్రులు.. ఆర్కే రోజా, విడదల రజినీ తదితరులు సీఎం జగనన్నకు రాఖీ కట్టి ఆయనను తమ సోదరుడని చెప్పుకుంటున్నారు.. గతంలో రోజా టీడీపీలో ఉన్నప్పుడు.. మహానేత రాజశేఖర్ రెడ్డిని ఎన్ని మాటలన్నారో అందరికీ తెలిసిందేనని… అలాగే ఇక విడదల రజినీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. 2017లో విశాఖ వేదికగా జరిగిన మహానాడులో మాట్లాడుతూ.. నరకాసురులు ఎవరంటే జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను చూపించాలంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వీరిద్దరు వైసీపీలో చేరి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చక్రం తిప్పుతున్నారు.
అందలం ఎక్కిన వారు.. అందలం ఎక్కించిన వారిని దూరం చేసుకొంటే.. ఆ తర్వాత ఏ ఎండుకా గొడుగు, ఏ రోటి దగ్గర ఆ పాట పాడే.. భజన బ్యాచ్ అన్ని చోట్ల… అన్ని వేళలా రెడీగా ఉంటుందనీ, ఆ బ్యాచ్ గాని రంగంలోకి దిగితే… ఆ తర్వాత.. మళ్లీ ఎన్నికల వేళ.. మన కోసం కష్టపడే వారి కోసం దుర్భిణీ వేసి వెతుక్కోవాల్సి ఉంటుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. భజన చేసే వాళ్లు, రాఖీ కట్టే వాళ్లు ఈ రోజు ఉండవచ్చు.. కానీ రేపు అధికారం దూరం అయితే.. వీళ్లంతా స్వతంత్ర అభ్యర్థుల్లాగా కోతి కొమ్మచ్చి ఆటలతో మరో పార్టీలోకి జంప్ చేసే అవకాశాలు నూటికి నూరుశాతం ఉన్నాయనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్ వాడివేడిగా కొనసాగుతోంది. ప్రస్తుతం జగన్ సోదరి షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్నారన్న వార్తతో జగనన్న నాడు వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ లో వస్తోందనీ, ఇది జగన్ కు కచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమేననీ అంటున్నారు.