పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఓ వ్యక్తి హైదరాబాద్ కు రావడం కలకలం రేపుతుంది. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీసా లేకుండా నేపాల్ మీదుగా భారత్ లోకి ఫయాజ్ వచ్చాడు. దీంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు పాకిస్థాన్ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఫయాజ్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు.
అయితే, హైదరాబాద్ కు చెందిన ఓ యువతి కోసం ఫయాజ్ ఇక్కడికి వచ్చినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి కి ప్రెగ్నెన్సీ కావడంతో ఆమెను కలవడానికి నేపాల్ మీదుగా హైదరాబాద్ ఫయాజ్ వచ్చినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఫయాజ్ నుంచి పోలీసులు పలు విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో సదరు యువతి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చింది. మహ్మద్ ఫయాజ్ ను చూపించాలని పోలీసులను వేడుకుంది. అయితే, ఫయాజ్ నుంచి పూర్తి విషయాలు తీసుకున్న తర్వాతే.. పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇక, పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ అనే మహిళ తన నలుగురు పిల్లలతో పబ్జీలో పరిచయమై యువకుడి కోసం అక్రమంగా ఉత్తరప్రదేశ్ వచ్చిన ఇష్యూ ఇంకా దేశం మరిచిపోలేదు. అయితే, అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ.. తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లా ఖాన్ ను కలిసేందుకు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఫ్రావిన్స్ లోని దీర్ నగరానికి వెళ్లింది. అయితే, పాకిస్థాన్-భారత్ రెండు దేశాలకు చెందిన వారి మధ్య ప్రేమ వ్యవహారాలు కొనసాగుతున్నాయి.