కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనం లాంఛనమే.. రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు టానిక్ | ysrtp merger in congress a formality| sharmila| sonia| rahul| meet| ap| politics| brs
posted on Aug 31, 2023 1:07PM
వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం ఇక లాంఛనమే. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల గురువారం (ఆగస్టు 31) హస్తినలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తన భర్త అనీల్ తో కలిసి సోనియాతో భేటీ అయిన అనంతరం షర్మిల ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. గత కొద్ది రోజులుగా వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విలీన చర్చలలో అనేక ఆప్షన్స్ వెలుగులోనికి వచ్చాయి.
వైఎస్ షర్మిల తొలి నుంచీ కూడా తన కార్యక్షేత్రం తెలంగాణయే అని చెబుతూ వస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఆమె అవసరం తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువ ఉందని చెబుతూ వస్తున్నది. దీంతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఆమె సేవలు ఎక్కడ అన్న విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభన కారణంగానే ఇప్పటి వరకూ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. అయితే గురువారం (ఆగస్టు 31) షర్మిల సోనియా భేటీతో విలీనం విషయంలో స్పష్టత వచ్చింది. ఈ విలీనం కారణంగా కాంగ్రెస్ కు భారీ ప్రయోజనం చూకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు షర్మిల అంగీకారం తెలిపారని చెబుతున్నారు.
షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా తెలంగాణలో వైఎస్ బ్రాండ్ ను తిరిగి తెరమీదకు తీసుకురావడం ద్వారా ఆ రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం సంతృప్తి చెందుతుంది. అదే సమయంలో ఆమె ఏపీలో కీలక పాత్ర పోషించడం ద్వారా వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీకి తరలిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అన్నిటికీ మించి తెలంగాణలో అధికారం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ కు వైఎస్సార్టీపీ విలీనం బోనస్ అవుతుందనే చెప్పాలి. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో తెలంగాణ ఇచ్చిన సోనియాను కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ణతలు తెలిపిన కేసీఆర్ టీఆర్ఎస్ ( ఇప్పుడు బీఆర్ఎస్) ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ప్రకటించారు. అయితే ఆ తరువాత మాట తప్పడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నార్థకం చేసే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ను బలహీనం చేశారు. అది పక్కన పెడితే ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ లా తాను మాట తప్పననీ, చెప్పింది చేస్తాననీ షర్మిల గట్టిగా చెప్పే అవకాశం ఉంది.
సోనియాతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన షర్మిల తెలంగాణలో కేసీఆర్ పాలన అంతమయ్యే సమయం వచ్చిందని చేసిన వ్యాఖ్యను ఈ నేపథ్యంలోనే తీసుకోవలసి ఉంటుంది. తాను స్వయంగా ఏపీ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించడానికి అంగీకరించి కూడా షర్మిల తెలంగాణ రాజకీయాల గురించి, మరీ ముఖ్యంగా కేసీఆర్ నియంతృత్వ పోకడలు, కుటుంబ పాలనపై చేసే విమర్శలు బీఆర్ఎస్ కు కచ్చితంగా నష్టం చేకూరుస్తాయని కాంగ్రెస్ గట్టిగా విశ్వసిస్తున్నది. అలాగే రెండు రాష్ట్రాలలోనూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న ప్రజాభిమానం షర్మిల పార్టీ విలీనంతో కాంగ్రెస్ కు ఒక పాజిటివ్ వేవ్ గా పనికి వస్తుందని కాంగ్రెస్ విశ్వసిస్తున్నది. తెలంగాణ ఎన్నికల సమయం ముంచుకువస్తున్న తరుణంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ డిసైడెంది.
ఆమెకు ఏపీలో కీలక పాత్ర ఇచ్చినా.. ఆమె సేవలను మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వినియోగించుకునే విధంగా వ్యూహ రచన చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు షర్మిల అంగీకారం తెలపడంతోనే సోనియాతో భేటీ కుదిరిందని చెబుతున్నారు. సోనియాతో భేటీలో కూడా ఏపీలో పార్టీ బాధ్యతలను షర్మిల చేపట్టాలని కాంగ్రెస్ చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కూడా షర్మిల పాల్గొంటారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విలీన ప్రకటన వైఎస్ వర్ధింతి అయిన సెప్టెంబర్ 2న అధికారికంగా వెలువడుతుందని చెబుతున్నారు. సోనియాతో చర్చల సందర్భంగా షర్మిల రాహుల్ ను ప్రధాని చేయాలనే తన తండ్రి లక్ష్య సాధన కోసం పని చేస్తానని చెప్పారని చెబుతున్నారు.
విలీనం ప్రతిపాదనల మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే షర్మిల తన సేవలను పూర్తిగా ఏపీకే పరిమితం చేస్తారనీ, మరీ ముఖ్యంగా తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను గద్దెదింపడమే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు పూర్తవుతూనే ఏపీలో ఫోకస్ చేసేలా ఇప్పటికే షర్మిలతో కాంగ్రెస్ నాయకత్వం చర్చలు చేసింది. పార్టీ తరపున ఏపీలో ప్రచారానికి షర్మిల అంగీకరించారని సమాచారం. ఇదే సమయం లో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగించేందుకు సిద్దమైంది. దీని ద్వారా ఏపీలో సీఎం జగన్..ఆయన ఓట్ బ్యాంక్ లక్ష్యంగా ఏపీలో షర్మిల సేవలను కాంగ్రెస్ వినియోగించుకోవాలని భావిస్తోంది. అలాగే షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ ఆఫర్ తో పాటుగా కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు బరిలోకి దించే ప్రతిపాదన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినట్లు, ఆ ప్రతిపాదనకు షర్మిల అంగీకరించినట్లూ విశ్వసనీయ సమాచారం. ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగించడం ద్వారా విభజన తరువాత జగన్ వైపు మళ్లిన కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు తిరిగి పార్టీ వైపు వస్తుందని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు.