Rythu Bharosa: రేపు(శుక్రవారం) కౌలు రైతులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. రైతుల ఖాతాల్లో వర్చువల్‌గా సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. మొత్తం 1,46,324 మందికి లబ్ది చేకూరనుంది. ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయం వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న సాగుదారులకు వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్న రాష్ట్ర సర్కారు.. 2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని సెప్టెంబర్ 1న అందించనుంది. ఇవాళ(గురువారం) జరగాల్సిన కార్యక్రమం రేపటికి వాయిదా పడిన విషయం తెలిసింది. రేపు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా సాయాన్ని జమ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో భూయజమానులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోంది. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవాదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందజేస్తోంది.